ఆ వైసీపీ నేత‌కు జ‌గ‌న్ చెక్ పెట్టేసిన‌ట్టే… మ‌ళ్లీ ఆట‌లో అర‌టి పండే…!

August 7, 2020 at 6:17 pm

వైఎస్సార్ సీపీలో సంస్థాగ‌త మార్పుల దిశ‌గా అధినేత జ‌గ‌న్ దృష్టి సారించారు. కొన్ని కీల‌క‌మైన జిల్లాల్లో పార్టీని బ‌లోపేతం చేసేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌కాశం జిల్లా ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్సార్ సీపీ ఇంచార్జ్‌గా ఉన్న రావి రామ‌నాథం బాబును ప‌క్క‌న పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు అధికార పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. పార్టీని ముందుండి న‌డిపించ‌డంలోను, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, రెండోసారి కూడా విజ‌యం సాధించిన ఏలూరి సాంబ‌శివ‌రావు దూకుడుకు అడ్డుక‌ట్ట వేయ‌డంలోను రావి విఫ‌ల‌మ‌య్యార‌నే నివేదిక‌ల నేప‌థ్యంలోనే జ‌గ‌న్ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది.

రావి రామ‌నాథం బాబు.. ఆదిలో వైఎస్సార్ సీపీ నాయ‌కుడే అయితే.. గ‌త ఏడాది ఎన్నిక‌లకు ముందు ఆయ‌న ప‌రుచూరు టికెట్ ఆశించారు. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఆయ‌న పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉండ‌డంతో పాటు ఎన్నిక‌ల్లో సీటు ఆశించారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు అస్త‌వ్య‌స్తంగా ఉన్న ప‌రుచూరు వైసీపీని గాడిలో పెట్టారు. అయితే ఎన్నిక‌ల ముందు అనూహ్యంగా ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌రావు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ టికెట్‌ను ద‌గ్గుబాటి కుమారుడికి ఇవ్వాలని నిర్ణ‌యించారు. అయితే, చివ‌రి నిముషం వ‌ర‌కు అమెరికాలో గ్రీన్ కార్డు ర‌ద్దు కాలేదు. దీంతో నేరుగా ద‌గ్గుబాటి రంగంలోకి దిగారు.

అయితే, ఈ ఘ‌ట‌న ద‌రిమిలా వెంట‌నే క్ష‌ణం కూడా ఆల‌స్యం చేయ‌కుండా రావి రామ‌నాథం టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌మ‌క్షంలో ఆ పార్టీలోకి చేరిపోయారు. అక్క‌డ కూడా టికెట్ లేద‌ని, రాద‌ని తెలిసి కూడా ఆయ‌న వైఎస్సార్ సీపీ త‌న‌కు టికెట్ ఇవ్వ‌లేదు కాబ‌ట్టి ఆ పార్టీని ఓడించాల‌నే ల‌క్ష్యంగా టీడీపీ సైకిల్ ఎక్కారు. ఇక‌, ఎన్నిక‌ల్లో ద‌గ్గుబాటి ఓడిపోయారు. త‌ర్వాత టీడీపీ నాయ‌కుడు ఏలూరి సాంబ‌శివ‌రావు గెలిచిన‌ప్ప‌టికీ.. పార్టీ అధికారం కోల్పోయింది. ఈ ప‌రిణామంతో మ‌ళ్లీ రావి వైఎస్సార్ సీపీ గూటికి చేరిపోయారు. దీంతో జ‌గ‌న్ మళ్లీ ఆయ‌న‌కు ప‌రుచూరు ఇంచార్జ్ పీఠాన్ని రావికి ఇచ్చారు. అలాగే డీసీఎంఎస్ చైర్మ‌న్ ప‌ద‌విని కూడా జ‌గ‌న్ రామ‌నాథంకు కట్ట‌బెట్టారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. త‌న‌కు ఎలాంటి ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌నే ఆలోచ‌న‌తో.. రావి మౌనంగా ఉంటున్నారు. పార్టీని ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ ప‌రిణామాల‌తో ఆయ‌న‌ను మార్చాల‌నే డిమాండ్లు వ‌స్తున్నాయి. ఇక‌, చీరాల నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఆమంచికి ప‌రుచూరు బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించుకున్న జ‌గ‌న్ ఆదిశ‌గా అడుగులు వేస్తున్నార‌ని తెలుస్తోంది. చీరాల‌లో ఆమంచి వ‌ర్సెస్ క‌ర‌ణం పోరును తీర్చేందుకు ఆమంచిని ప‌రుచూరుకు పంపాల‌న్న‌దే జ‌గ‌న్ ప్లాన్ అంటున్నారు. దీంతో రావి కి రేపో మాపో చెక్ పెట్ట‌డం ఖాయ‌మ‌న‌ట్టే అని తెలుస్తోంది.

ఆ వైసీపీ నేత‌కు జ‌గ‌న్ చెక్ పెట్టేసిన‌ట్టే… మ‌ళ్లీ ఆట‌లో అర‌టి పండే…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts