బెజవాడ రాజకీయాలు: వైసీపీకి ప్లస్ అవుతుంది ఇక్కడే?

August 7, 2020 at 12:22 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజధానిగా పేరొందిన విజయవాడ(బెజవాడ)లో ప్రతిపక్ష టీడీపీకి మంచి పట్టుంది. 2014 తర్వాత విజయవాడ నగరంలో టీడీపీ తిరుగులేని ఆధిక్యం తెచ్చుకుంది. టీడీపీకి నగరంపై ఎంత పట్టుందో 2019 ఎన్నికల్లోనే తెలిసిపోయింది. ఆ ఎన్నికల్లో రాష్ట్రమంతా జగన్ గాలి ఉన్నా సరే, నగరంలో టీడీపీ హవా నడిచింది. విజయవాడ ఎంపీ సీటుతో పాటు, తూర్పు అసెంబ్లీ సీటు టీడీపీ ఖాతాలోనే పడింది.

ఇక సెంట్రల్ సీటుని కేవలం 25 ఓట్ల తేడాతో కోల్పోతే, వెస్ట్ సీటుని 7వేల తేడాతో ఓడిపోయింది. సెంట్రల్‌లో వైసీపీ తరుపున మల్లాది విష్ణు గెలిస్తే, వెస్ట్‌లో వెల్లంపల్లి శ్రీనివాస్ గెలిచారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెజవాడ రాజకీయాలు మారుతూ వస్తున్నాయి. నిదానంగా నగరం టీడీపీ చేతుల్లోనుంచి వైసీపీ చేతుల్లోకి వస్తున్నట్లు కనబడుతోంది.

ముఖ్యంగా విజయవాడ తూర్పు నియోజకవర్గానికి దేవినేని అవినాష్‌ని ఇన్‌ఛార్జ్‌గా నియమించాక పరిస్థితులు కొంచెం వైసీపీకి అనుకూలంగా మారాయి. తూర్పులో అవినాష్ మంచి పనితీరు కనబర్చడంతో వైసీపీకి కలిసొచ్చింది. ఇదే సమయంలో మంత్రిగా వెల్లంపల్లి నగరంపై పట్టు తెచ్చుకునేందుకు చూస్తున్నారు. అటు మల్లాది కూడా ఎమ్మెల్యేగా రాణించడంతో నగరంపై వైసీపీకి అనుకూల వాతావరణం ఉంది.

అయితే విజయవాడ పార్లమెంట్ పరిధిలో మాత్రం వైసీపీకి ఇంకా పట్టు దక్కలేదని తెలుస్తోంది. ఎంపీ కేశినేని నాని దూకుడుగా ఉండటం, ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయినా పీవీపీ పెద్దగా అందుబాటులో లేకపోవడం వల్ల పార్లమెంట్‌లో పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా రాలేదు. కానీ నగరంలో మాత్రం కాస్త పట్టు వచ్చినట్లే కనిపిస్తోంది. ఎన్నికల్లో తూర్పు ఓడిపోయినా సరే, అవినాష్ ఎంట్రీతో బెజవాడ రాజకీయం పూర్తిగా మారిపోయింది. అవినాష్ వల్ల తూర్పులో ప్లస్ అవ్వడంతో నగరంపైన వైసీపీకి పట్టు దక్కింది.

బెజవాడ రాజకీయాలు: వైసీపీకి ప్లస్ అవుతుంది ఇక్కడే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts