
ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై
యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ ధ్రుత్యున్నతోత్సాహులై
ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్
ఈ తెలుగు పద్యాన్ని తెలంగాణ ప్రజలు ఎక్కువగా ముఖ్యమంత్రి కేసీఆర్ నోటనే విని వింటారు. రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో అనేక సభల్లో ఈ పద్యాన్ని వినిపించారు. ఇప్పుడు ఈ పద్యం ముఖ్యమంత్రికే అచ్చిగుద్దినట్లుగా సరిపోతుంది. ఎందుకంటే ఈ గులాబీ దళపతి మాటచెప్పినా.. ఏదయినా పనిని సంకల్పించారంటే దాని అంతు చూసేదాక వదిలిపెట్టరు. రాజకీయ వ్యూహాలను రచించడంలో ఆయనకు ఆయనే సాటి. కల్ కర్నేకా ఆజ్ కరో.. ఆజ్ కర్నేకా కామ్ అబీ కరో అన్న తీరుగానే ఉంటుంది. ప్రత్యర్థులు తేరుకునేలోగానే అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటారు. ఆయన ఎప్పుడు ఏ మాట పలికినా.. మరే ఎత్తు వేసినా అందులో ఎంతో దూరదృష్టి కనబడతుంది. ఇప్పుడిదంతా ఎందుకు అనుకుంటున్నారా? అందుకు ప్రత్యేక కారణముంది. మొన్నటి ఎన్నికల ముందు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని ప్రకటించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ఎన్నికల ఫలితాలు అంతగా కలిసిరాలేదు. ఊహించని రీతిలో బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. అటు తరువాత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అంశాన్ని పక్కన పెట్టారని అంతా అనుకున్నారు. కానీ సారు మాత్రం ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఒక్కో పావును కదుపుతున్నారు. బలాన్ని కూడగట్టుకుంటున్నారు. ఇప్పుడు గులాబీ దళపతి గురి హస్తినాపురిని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. రాజకీయ సమీకరణాలను దగ్గరి నుంచి చూస్తున్న వారెవరైనా ఈ విషయాన్ని ఒప్పుకుంటారు. నిజమే కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పేందుకు తహతహలాడుతున్నారని అనుకుందాం. మరి ఆ కల నెరవేరుతుందా? అందుకు కలిసివచ్చే పరిస్థితులున్నాయా? జాతీయ స్థాయిలో గులాబీతో జోడికట్టే నేతలు ఎవరున్నారు? హస్తినాపురిని దక్కించుకునేందుకు కేసీఆర్ పన్నుతున్న వ్యూహాలు ఏమిటీ? ఆ ప్రయత్నాలు ఎంత వరకు వచ్చాయి? అన్నవి ఇప్పుడు చర్చించుకోవాల్సిన అంశాలు. ఆ ఆవశ్యకత కూడా ఉన్నది.
రెండవ సారి అధికారంలోకి చేపట్టాక సీఎం కేసీఆర్ తన బాధ్యతలను కుమారుడు, మంత్రి కేటీఆర్ కు అప్పగిస్తారని జోరుగా ప్రచారం సాగడంతో ఒకానొక సమయంలో ఈ అంశంపై స్వయంగానే కేసీఆరే స్పందించారు. తాను ఇప్పట్లో బాధ్యతలను వదిలేది లేదని స్పష్టం చేశారు. అయితే తాజా మళ్లీ ఇప్పుడు అదే ప్రచారం జోరందుకుంది. ఈ దసరా నాటికి కేటీఆర్‌ను సీఎం కూర్చీలో కూర్చోబెట్టి, తాను జాతీయ రాజకీయాలకే పూర్తి సమయం కేటాయించాలనే ఆలోచన చేస్తున్నారని రాజీకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతున్నది. అది వేరే విషయం అనుకుందాం. ఇప్పట్లో ఎన్నికలు లేవు. అప్పుడే కేసీఆర్ ఎందుకు తొందర పడుతున్నారని చాలా మంది అనుకోవచ్చు. అయితే కేసీఆర్ ఏ అడుగు ముందుకేసినా ఒకటికి పదికి ఆలోచిస్తారనేది ఆయనను సన్నిహితంగా చూసినవారెవరికైనా తెలుసు. ఇప్పుడు కూడా బలమైన రాజకీయ ఎజెండాతోనే ఢిల్లీపై చూస్తున్నారని తెలుస్తున్నది. అందుకు ఇప్పటికే పావులు కదపడం మొదలు పెట్టడం విశేషం. ఇక ఆ కారణమేమంటే.. బీజేపీ దేశంలో అధ్యక్ష తరహా పాలనను తెరతీసేందుకు అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా 2022 లేదంటే 2023లో అసెంబ్లీ, పార్లమెంట్‌కు ఒకే సారి ఎన్నికలను నిర్వహించాలని ప్రణాళికలను రచిస్తున్నది. అది ఎంతమేరకు సాధ్యమనే అంశంపై అధ్యయనం చేసేందుకు గుజరాత్ సీఎం విజయ్ రూపానితో ఒక అంతర్గత కమిటీని కూడా నియమించినట్లు కమల దళ సభ్యుల్లో చర్చ కొనసాగుతున్నది. అయితే ఇక అధ్యక్ష తరహా పాలన గనక విధిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు పోటీ చేసే అవకాశం లేకుండా పోతుంది. అవి కేవలం అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. సరిగ్గా ఈ విషయాన్ని పసిగట్టిన కేసీఆర్ ఇప్పుడు చకాచకా అడుగులు వేస్తున్నారు. ఒకవైపు బీజేపీని అడ్డుకోవడంతో పాటు, మరోవైపు జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయశక్తిగా ఎదిగేందుకు వ్యూహాలను రచిస్తూ ముందుకు సాగుతున్నారు. త్వరలోనే కేటీఆర్‌కు పూర్తి బాధ్యతలను, లేదంటే ఉపముఖ్యమంత్రిగా నియమించి, సీఎం హోదాలో జాతీయస్థాయిలో మంతనాలు జరిపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తున్నది.
సరే ఆ విషయాలన్ని పక్కన బెడదాం. ఇప్పుడు సీఎం కేసీఆర్‌తో కలిసి వచ్చే పార్టీలు ఏమున్నాయి? జాతీయ స్థాయిలో రాణించగలుగుతారా? తన ప్రభావాన్ని చూపగలుగుతారా? అన్నది ఇప్పుడు అన్నింటికంటే చర్చనీయాంశంగా మారింది. గులాబీ శ్రేణుల్లోనూ దీనిపై చర్చ జోరుగా కొనసాగుతున్నది. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో స్తబ్దత నెలకొన్నది. ప్రజల్లో కాంగ్రెస్‌పై విశ్వాసం పూర్తిగా తుడిచి పెట్టుకుపోతున్నది. రాహుల్‌గాంధీ నాయకత్వంపై నమ్మకమే లేకుండా పోయింది. పార్టీలోని సీనియర్లు సైతం కాంగ్రెస్ కాడిని వదిలి ఇతర పార్టీల గూటికి చేరుతుండడం గమనార్హం. దీంతో బీజేపీకి ఎదురులేకుండా పోయింది. ప్రతిపక్ష పాత్ర పోషించే పార్టీ ఒక్కటి కూడా లేదు. ఆరేళ్లుగా బీజేపీ చేసే ఏ పనికీ అడ్డు ఆపు లేకుండా పోయింది. ప్రశ్నించేవారే కరువయ్యారు. మరోవైపు సామాన్య ప్రజల్లోనూ మోడీ పై భ్రమలు తొలగుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అడుగుపెడితేనే ఫలితం ముంటుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఏ మేరకు ప్రభావాన్ని చూపగలరు? బీజేపీని ఢీ కొట్టగలరా? దక్షిణాది ఆధిపత్యాన్ని ఉత్తరాదివారు స్వాగతిస్తారా? అన్నవి ఇప్పుడు మిగిలిన ప్రశ్నలు. అనేకమందిలో ఉన్న సందేహాలు. వాటికి సమాధానం కొంత క్లిష్టమైనా సుస్ఫష్టమే. తెలంగాణ సాధనతో పాటు, రాష్ట్రాన్ని తన పాలనాదక్షతో ప్రగతి పథంలో నడిపిస్తున్న తీరుకు యావత్ భారత్‌లో పేరు సంపాదించారు కేసీఆర్. దేశంలోని అనేక రాష్ట్రాలు తెలంగాణ ప్రభుత్వ పథకాలను అమలు చేస్తుండడమే అందుకు నిదర్శనం. స్వయంగా కేంద్ర ప్రభుత్వం సైతం పలు పథకాలను శ్లాఘించి కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తిన సందర్భాలున్నాయి. మరొక అంశం ఏమిటంటే ఎంతటి వారినైనా కట్టిపడేసే వాక్పటిమ. మోదీని ఢీ కొట్టగల వాగ్దాటి ఇప్పుడున్న నేతల్లో కేసీఆర్ ఒక్కరే కనబడుతుండడం. అదిగాక పరిపాలనపై పూర్తిస్థాయిలో పట్టు ఉండడం, జల, విద్యుత్ వనరుల అధ్యయనం చేసిన నేత కావడం అనే అంశాలు కూడా కేసీఆర్‌కు వరంగా పరిణమించనున్నాయి. అన్నింటికీ మించి వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న నేతగా ప్రఖ్యాతిని పొందారు. ఇప్పటికీ రాష్ట్రాల హక్కులు, నిధుల వాటాల కోసం గళాన్ని వినిపిస్తున్న ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ ఒక్కరేనని చెప్పాలి. సమయం, సందర్భం వచ్చిన ప్రతి సారీ బీజేపీపై ఒంటికాలితో లేస్తూనే ఉన్నారు గులాబీ దళపతి. ఇక మరోక విషయం ఏమిటంటే తెలంగాణ సాధన సమయం నుంచి జాతీయ స్థాయి నేతలతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తుండడం గమనార్హం. ఇలా ఎన్నివిధాలుగా బేరీజు వేసుకున్నా కేసీఆర్‌కు ఢోకా లేనట్లే కనబడుతుంది.
ఢిల్లీని శాసించాలనే కేసీఆర్ విశ్వసిస్తున్నారు. అందుకోసం చకచకా అడుగులు వేస్తున్నారు. జాతీయ స్థాయిలో పార్టీని ఏర్పాటు చేస్తే బాగుటుందనే యోచనలో ఉన్నట్లు కనబడుతున్నది. అవసరమైతే తానే లీడ్ తీసుకుని జాతీయ స్థాయిలో పార్టీని ఏర్పాటు చేస్తామని గతంలో కేసీఆరే స్వయంగా ప్రకటించారు అందులో భాగంగా ఇప్పటికే జాతీయ పార్టీకి పేరును ఖరారు చేసినట్లు తెలుస్తున్నది. అదేవిధంగా బెంగాల్ సీఎం మమత, జార్ఘండ్ జేఎంఎం నేత హేమంత్ సోరేన్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ముఖ్యమైన నేతలతో కేసీఆర్ ఇప్పటికే మంతనాలు ప్రారంభించారని గులాబీ వర్గాలు తెలుపుతున్నాయి. మరోవైపు తొలి దక్షిణాది ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు పేరును తెరపైకి తీసుకురావడంలో అంతరార్థం కూడా ఇదేనని తెలుస్తున్నది. రాజకీయ వ్యూహంలో భాగంగానే శత జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించాలని సంకల్పించారని తెలుసుస్తున్నది. తద్వారా వివిధ రాష్ట్రాల్లోనూ కార్యక్రమాలను నిర్వహించి దక్షిణాదివారి పాలనదక్షతలను యావత్ భారతానికి మరోసారి చాటిచెప్పాలనే దూరాలోచనతోనే అందుకు శ్రీకారం చుట్టారని కనిపిస్తున్నది. ఎందుకంటే ఇక్కడ గమనించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఒకటి పీవీ దక్షిణాదివాడు మాత్రమే కాదు, గాంధీయేతర కుటుంబానికి చెందిన కాంగ్రెస్ తొలి ప్రధాని కావడం ఒకటి. అందువల్లే ఆ అంశాన్ని, తన ఆంకాక్షను చాటేందుకు పీవీ జయంతిని ఎంచుకున్నారని తెలుస్తున్నది. అదీగాక రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీపై ఎలా వ్యవహరించాలి అనే అంశంపై పార్టీ ఎంపీలకు కూడా పలు కీలక నిర్దేశం చేసినట్లు తెలుస్తున్నది. బీజేపీపై ఎదురుదాడికి దిగాలనే సంకేతాలిచ్చారని పలువురు నేతలు చెబుతున్నారు. ఢిల్లీవైపు చాలా చక్యంగా, ఆచితూచి ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు కేసీఆర్. మరి ఆయన ఏ మేరకు సఫలికృతులవుతారన్నది కాలమే చెప్పాలి.