
రాజకీయం అంటేనే అంత. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. అన్నింటికీ మించి నమ్మకం అనే పదానికి ఈ రంగంలో అసలు తావే ఉండదని ప్రస్తుతం కొందరు నాయకులు వ్యవహరిస్తున్న తీరును చూస్తే అర్థమవుతున్నది. చోటమోట నాయకులుగా తెరపైకి వచ్చి.. కొద్దిలో పెద్దల ప్రాపకాన్ని సంపాదించి అంతలోనే తమకు నీడనిచ్చిన చెట్టునే తెగనరకాలనే చూస్తుండడం గమనార్హం. అంతా అవకాశవాదం. స్వార్థచిత్తం. ఎప్పుడు కుర్చీలో ఉన్న నాయకుడిని దించేద్దామా? ఎప్పుడెప్పుడు కుర్చీలో కూర్చుందామా? అని కొందరు.. ఏది చేసయినా సరే.. తమ నాయకుడి రాజకీయ జీవితం ఏమైనా ఫర్వాలేదు.. దీపం ఉండగానే నాలుగు పైసలు సంపాదించుకుందాం అనేకునేవారు మరికొందరు ఉండడం ఇక్కడ పరిపాటి. ఏ రాజకీయ పార్టీలోనైనా సహజమే అయినా అధికార పార్టీలో ఈ తరహా నేతల సంఖ్య ఇప్పుడు రోజురోజుకూ పెరిగిపోతుండడం గమనార్హం. బడా నేతలకు నీడగా వ్యవహరించిన వారే ఇప్పుడు లేని సమస్యలను తీసుకువస్తూ వారికి తలనొప్పిగా మారుతుండడం ఒకటయితే.. రహస్యంగా ఉంచాల్సిన విషయాలను, సమాచారాలను లీకు చేస్తూ పార్టీ పెద్ద వద్దా ఆ బడా నేతల పరువును తీస్తూ బద్నాం చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. అయితే ఎవరూ ఏ కారణం లేకుండా ఈ రకమైన వ్యవహారాలకు తెరలేపరు కదా అని, మరి వీరేందుకు అలా చేస్తున్నారని కొంచెం లోతుగా ఆలోచించగా, వారి సమీపంగా వారితో వాకబు చేయగా అంతకంటే షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికల్లో తామ బరిలో నిలిచేందుకే ఇప్పటి నుంచి బాటలు వేసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తుండడం ఇక్కడ కొసమెరుపు. టీఆరెస్‌లో ఉన్న ఆ లీగు నేతలు ఎవరు? వారు చేస్తున్నదేమిటీ? ఆశిస్తున్నదేమిటీ? ఆయా చోట్ల అసలు గులాబీ పరిస్థితి ఏమిటీ? ఈ వ్యవహారలు బాస్ దృష్టికి వెళ్లాయా? కేటీఆర్ ఏమి ఆలోచిస్తున్నారు? అన్నవి ఇప్పటి అంశాలు.
టీఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచీ ఆయన ఉన్నారు. బీసీ నాయకుడు. గులాబీ బాస్ కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. ఒకానొక దశలో పార్టీ బాధ్యతలనే ఆయన భుజస్కందాలపై మోసిన ధీశాలి. మొదటి కేబినెట్లోనే మంత్రి పదవి సంపాదించుకున్నాడు. రెండో సారి కూడా కీలకశాఖనే దక్కించుకున్నారు. అయితే గత కొంత కాలంగా ఆ నాయకుడిని సమస్యలు చుట్టుముడుతున్నాయి. లేని వివాదాల్లో, తనకు సంబంధం లేని విషయాల్లో చిక్కుక్కుంటూ అపఖ్యాతి పాలవుతున్నారు. ఒకానోక దశలో గులాబీబాస్ కూడా సదరు మంత్రి వ్యవహార సరళిని అనుమానించి, దూరం పెట్టాలనే ఆలోచనకు కూడా వచ్చారంటే పరిస్థితి\ ఎంతలా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. మొన్నటికిమొన్న సదరు మంత్రి గారి నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకులు పర్యటించడం, ఆయనపై ఎదురుదాడికి దిగడం, అదీగాక ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి మరణానికి సంబంధించి మంత్రిపైనే బురదచల్లేందుకు సిద్ధమవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అది నానా రభస జరిగింది. అసలు ఇదంతా ఎలా జరుగుతున్నది? ఎవరు చేస్తున్నారు? అని సదరు మంత్రివర్యుల నేరుగా రంగంలోకి దిగి కూపీ లాగితే అసలు విషయం తెలిసి నిర్ఘాంతపోయారట. ఈ తతంగం వెనక తన కీలక అనుచరుడే ఉన్నాడని తెలియడమేగాక, \సదరు నాయకుడు ఇప్పటి నుంచే రాబోయే సాధారణ ఎన్నికలకు రంగం చేసుకుంటున్నాడని తెలియడం మరింత ఆశ్చర్యానికి గురి చేసిందట. \కార్యకర్తగా పార్టీలో చేరినా, నమ్మి చేరదీసి. అవకాశాలను కల్పించి, \ఆపై కీలక పదవులను అప్పగిస్తే మెల్లగా చాపకింద నీరులా తన సీటుకే ఎసరే పెట్టేందుకు కుట్రలకు తెరలేపడం అమాత్యుడు జీర్ణించుకోలేపోతున్నాడట. మొన్నటివరకు పరోక్షంగా లేని సమస్యలను తీసుకొచ్చి మంత్రిగారి కీర్తికి మచ్చతెచ్చేందుకు ప్రయత్నించినా అవేవీ నెరవేరకపోవడంతో ఇప్పుడు నేరుగా ప్రతిపక్ష నేతలతోనే కుమ్మక్కయి ఈ తరహా రాజకీయం నెరపడం గమనార్హం. ఇదే విషయాన్ని గతంలో ఓ బహిరంగ సభలో సదరు అమాత్యుడే బహిరంగంగా పరోక్షంగా సదరు చోటనాయకుడిని ఉద్దేశించి చురకలు అంటించారు. అయినా అతని వ్యవహార సరళి మారకపోవడం అటుంచి శ్రుతిమించడం ఇక్కడ విశేషం. గురువు ద్వారా పెద్దల పలుకుబడిని సంపాదించిన సదరు నేత ఇప్పుడు గురువునే మింగేయాలని కుట్రలకు తెరలేపడం నియోజకవర్గంలోనే కాదు కరీంనగర్ జిల్లా రాజకీయాల్లోనే చర్చనీయాంశంగా మారింది.
ఇది ఒక్క కరీంనగర్ జిల్లాలోనే కాదు.. ప్రతి నియోజకవ్బీవర్గంలో , ప్రత్యేకంగా ప్రస్తుతం టీఆర్ ఎస్ నాయకులు ఎదుర్కొంటున్న సమస్య ఇంచుమించు ఇలాంటివే కావడం వారిలో ఆందోళనను రేకేత్తిస్తున్నది. నీడలా వెన్నంటి ఉన్నవారే ఇప్పుడు కత్తులు దూస్తున్నారు. అడుగులకు మడుగులొత్తిన వారే అడుగడుగుకూ అడ్డుగా నిలబడుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కీలక పదవులను అధిరోహించి,, ఎంతో కొంత సంపాదించిన వారంతా తామూ కీలకనేతగా ఎదగాలని ఉవ్విళ్లురుతున్నారు. రాబోయే ఎన్నికల్లో తమ ఉనికి చాటుకోవాలని ప్రణాళికలు రచించుకుంటున్నారు. అందుకు ఇప్పటి నుంచే బాటలు వేసుకుంటున్నారు. అందులో భాగంగానే చాలా మంది పార్టీ, తమ ముఖ్యనేతల సమాచారాన్ని ప్రతిపక్షాలకు, పత్రికలకు లీకు చేస్తూ వారి ప్రతిష్టను దిగజార్చే ఎత్తులు వేస్తున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలోని వారితే పోల్చితే అధికార టీఆర్ ఎస్‌లో ఈ బాపతు రాజకీయ నేతలు విపరీతంగా పెరిగిపోవడం ఇక్కడ గమనించాల్సిన అంశం. అందుకు కారణం లేకపోలేదు. టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీలకు చెందిన ఎంతో మంది కీలక నేతలు గులాబీ కండువాను కప్పుకున్నారు. ఒక మాటలో చెప్పాలంటే బీ టీమ్ నేతల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. వారంతా ఇప్పటికే మొదటి నుంచీ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలనే డ్యామినేట్ చేసే స్థాయికి ఎదిగారు. కొన్నిచోట్ల గులాభీ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకుల ఉనికే లేకుండా చేశారంటే అతిశయోక్తేమీ కాదు. అంతటి ప్రాబల్యం ఉన్న నేతలంతా కొంత కాలం వరకు మిన్నకుండినా ఇప్పుడు అవకాశాల కోసం వెంపర్లాడుతున్నారు. గుట్టు చప్పుడుకాకుండా పావులను కదుపుతున్నారని పలువురు గులాబీ నేతలే బాహాటంగా చర్చించుకుంటున్న విషయం. దీంతో పార్టీ వ్యవస్థ మొత్తం అగమ్యగోచరంగా మారిపోయింది. లీకులతో నేతల ఇమేజ్ను దెబ్బతీయడమేగాక, పార్టీ ప్రతిష్టను కూడా దిగజార్చుతుండడం గమనార్హం.
మరి ఇంతగా లీకు గ్యాంగులు రెచ్చిపోతున్నా గులాబీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ఆర్ ఈ వైపు ఎందుకు దృష్టి సారించడంలేదు ? అలాంటి నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని కొందరు గులాబీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. అధినేతను ప్రశ్నించలేక లోలోపలే ఒత్తుక చస్తున్నారు. పార్టీ పరమైన పదవులను, పలు నామినేటెడ్ పదవులను భర్తీ చేయపోవడం వల్ల నేతల మధ్య వివాదాలు చెలరేగుతున్నాయని తెలుస్తున్నాయి. వాటిల్లో అవకాశం కల్పిస్తే కొంతలో కొంత వరకైనా ఈ సమస్యలు పరిష్కరమయ్యే అవకాశముందని వారు సూచిస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే మరికొందరు గులాబీ బాస్ కనుసన్నల్లోనే జరుగుతున్నదని మరికొందరు ఆరోపిస్తుండడం ఇక్కడ మరో ట్విస్టు. అందుకు వారు తమ వాదనను వినిపిస్తున్నారు. పార్టీ రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చింది. నేడో రేపో కేసీ ఆర్ సీఎం బాధ్యతలను నుంచి తప్పుకుని కేటీఆర్‌కు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే ఆ యువ నాయకుడు తనదైన, తనకు నమ్మిన భంట్లుగా ఉండేవారిని పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని తెలుస్తున్నది. మళ్లీ వచ్చే సాధారణ ఎన్నికలకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారని పార్టీలో చర్చ కొనసాగుతున్నది. వచ్చేసారి చాలా మంది టీఆర్ ఎస్ మొదటి తరం నేతలకు టిక్కెట్లు దక్కే అవకాశమేలేదని, ఆయా కొత్తవారి పేర్లను తీసుకొచ్చేందుకు ముందునుంచే సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తున్నది. అందువల్లే లీకు గ్యాంగులను వారు పట్టించుకోవడం లేదని పలువురు గులాబీ నేతలు వివరిస్తుండడం గమనించాల్సిన విషయం. మరి ఇందులో వాస్తవమెంతో తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం మరొకటి కూడా ఉన్నది. ఒక నియోజకవర్గంలో వ్యక్తిని, ఒక మంత్రిని, నేతను బద్నాం చేయాలని చూస్తున్నారే తప్ప, వారితో పాటు పార్టీ ప్రతిష్ట కూడా దెబ్బతింటున్నదనే విషయాన్ని ఆలోచించకపోవడం గమనార్హం.