పార్ల‌మెంట్‌లో నిన్న‌టి ర‌గ‌డ‌పై నేడు రియాక్ష‌న్‌.. 8 మందిపై వేటు!

September 21, 2020 at 10:43 am

వ్యవసాయ బిల్లులపై నిన్న పార్ల‌మెంట్‌లో ర‌చ్చ ర‌చ్చ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సభలో బిల్లులను ప్రవేశపెట్టిన వెంటనే విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ ఏకంగా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ స్థానం వద్దకే దూసుకువెళ్లి ఈ బిల్లుల తాలూకు రూల్ బుక్ ని చించి పోగులు పెట్టారు. క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌కుండా బిల్లులుపై సభ్యులు మాట్లాడుతున్న సమయంలో కొందరు విపక్షాల ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చారు.

ఇక చివ‌ర‌కు విపక్షాల ఆందోళనల మధ్యే మూజువాణి ఓటుతో వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోద ముద్రవేసింది. అయితే రాజ్యసభలో ఆదివారం విపక్ష ఎంపీల ప్రవర్తనపై అధికారపక్షం సీరియస్ గా ఉంది. పోడియంలోకి దూసుకు రావడంతో పాటు, సభా మర్యాదలకు భంగం కలిగించారని, డిప్యూటీ చైర్మన్ పై దాడి చేశారని ఆరోపిస్తూ, 8 మంది విపక్ష సభ్యులపై రూల్ 256 ప్రకారం సస్పెన్షన్ వేటు వేసింది.

వీరిలో సస్పెండ్ అయిన వాళ్లలో డెరెక్ ఓ బ్రైన్, సంజయ్ సింగ్, రాజు సతవ్, కెకె రగేష్, రిపున్ బోరా, డోలా సేన్, సయ్యద్ నజీర్ హుస్సేన్, ఎలమరన్ కరీం ఉన్నారు. వీరిలో ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు కాగా, సీపీఐ(ఎం) నుంచి ఇద్దరు, ఏఐటీసీ నుంచి ఇద్దరు, ఒకరు ఆప్ సభ్యులు. వీరందరినీ ప్రస్తుత రాజ్యసభ సమావేశాలు ముగిసేంత వరకూ సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు చైర్మన్ వెంకయ్యనాయుడు వెల్లడించారు.

పార్ల‌మెంట్‌లో నిన్న‌టి ర‌గ‌డ‌పై నేడు రియాక్ష‌న్‌.. 8 మందిపై వేటు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts