బీజేపీ నేతల హౌస్ అరెస్ట్: విష్ణుకు చుక్కలు చూపిస్తున్న పోలీసులు…

September 18, 2020 at 9:33 am

ఏపీలో వరుసగా జరుగుతున్న హిందూ ఆలయాల‌పై దాడుల‌ విషయంలో ప్రభుత్వం తీరుకు నిరనగా బీజేపీ ఛలో అమలాపురం కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పి, పోలీసులు ఎక్కడికక్కడ బీజేపీ నేతలని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. పోలీసులు ముందస్తు చర్యలో భాగంగా బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు, మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ, విష్ణువర్ధన్ రెడ్డి వంటి ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు.

అటు ప్రకాశం జిల్లా కారంచేడులో బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ‘ఛలో అమలాపురం’ కార్యక్రమానికి వెళ్ళకుండా ముందస్తుగా ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. మరోవైపు రావెల కిషోర్ బాబు, ఆదినారాయణ రెడ్డిలని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎలాగోలా తప్పించుకుని అమలాపురం వెళ్ళిన విష్ణువర్ధన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని, వాహనంలో అన్నీ పోలీస్ స్టేషన్‌లు తిప్పారు.

అమలాపురంలో తనను నిర్బంధించి రాత్రంతా 300 కిలోమీటర్లు తిప్పారని విష్ణువర్థన్‌రెడ్డి మండిపడ్డారు. హిందువుల గురించి మాట్లాడడమే నేరమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్‌…. పోలీస్‌ రౌడీ రాజ్యం నడుపుతున్నారని అన్నారు.

 

బీజేపీ నేతల హౌస్ అరెస్ట్: విష్ణుకు చుక్కలు చూపిస్తున్న పోలీసులు…
0 votes, 0.00 avg. rating (0% score)