ఐబీ మాజీ చీఫ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ‌..‌

September 30, 2020 at 6:11 pm

సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. ఆయుధాలు అక్రమ కొనుగోలు కేసు నమోదుపై త‌న‌ను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాల‌ని ఆయ‌న వేసిన పిటిష‌న్‌ను ఏపీ హైకోర్టు తిర‌స్క‌రించింది. టీడీపీ ప్రభుత్వ హ‌యాంలో వెంకటేశ్వరరావు ఇంటలి జెన్స్ ఛీప్‌గా విధుల‌ను నిర్వ‌ర్తించారు. ఆ సంద‌ర్భంగా ఆయ‌న అనేక అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నేత హోదాలో ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్ అనేక మార్లు ఆరోప‌ణ‌లు చేశారు. ఇజ్రాయిల్ నుంచి సెక్యూరిటీ పరికరాలు కొనుగోలు విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని ధ్వ‌జ‌మెత్తారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నేప‌థ్యంలోనే ఏబీ వెంక‌టేశ్వ‌ర్‌రావు పై సీఎం జ‌గ‌న్ చర్యలు తీసుకున్నారు. ఆయనపై వైసీపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.

ఈ స‌స్పెన్ష‌న్‌ను వేటును వెంకటేశ్వరరావు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ను ఆశ్ర‌యించారు. అక్క‌డా ఆయ‌న‌కు చుక్కెదురైంది. దీంతో ఆయ‌న తిరిగి హైకోర్టులో పిటిష‌న్ వేశారు. ఆ మేరకు ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విధుల్లోకి తీసుకోవడంతోపాటు సస్పెన్షన్‌ కాలం నాటి జీతభత్యాలు చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. 1989 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఏబీ వెంకటేశ్వరరావు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ హోదాల్లో పని చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్‌గా విధులు నిర్వహించారు. తాజాగా ఆయ‌న దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను హైకోర్టు తిర‌స్క‌రించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఐబీ మాజీ చీఫ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ‌..‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts