తెలంగాణ జోలికి ఏపీ రావొద్దు: కేసీఆర్‌

September 30, 2020 at 12:38 pm

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాల‌నే నదీ జలాల విషయంలో తెలంగాణ‌ను కెలికి కయ్యం పెట్టుకుంటున్నద‌ని, అపెక్స్ సమావేశంలో ఏపీ చేస్తున్న వాదనలకు ధీటైన సమాధానం చెప్పాల‌ని, మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను కుండబద్ధలు కొట్టినట్లు స్పష్టం చేయాల‌ని, అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వ నిష్క్రియా పరత్వాన్ని, ఏడేళ్ల‌ అలసత్వాన్ని తీవ్రంగా ఎండగట్టాల‌ని, తెలంగాణ ప్రజల హక్కులను హరించడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రతిఘటించాల‌ని సంబంధిత అధికారుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబ‌ర్ 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్ లో నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఏర్పాటు చేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖకు సంబంధించిన, కేంద్రానికి చెప్పాల్సిన అన్ని విషయాలకు సంబంధించిన వివరాలను తీసుకొని సమావేశానికి రావాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు.

అపెక్స్ కౌన్సిల్‌ సమావేశం సందర్భంగా ‘‘రాష్ట్రాల పునర్విభజన చట్టాల ప్రకారం దేశంలో ఎప్పుడైనా కొత్త రాష్ట్రం ఏర్పడితే వెంటనే ఆ రాష్ట్రానికి జరిగే నీటిని కేటాయించాల‌ని, తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఏర్పడితే జూన్ 14న ప్రధాన మంత్రికి లేఖ రాశామ‌ని,. తెలంగాణ రాష్ట్రానికి నీటి కేటాంయిపులు జరపాలని కోరామ‌ని, ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్పూట్ యాక్ట్ 1956 సెక్షణ్ 3 ప్రకారం ప్రత్యేక ట్రిబ్యూనల్ ఏర్పాటు చేసైనా, లేదంటే ఇప్పుడున్న ట్రిబ్యూనల్ ద్వారానైనా తెలంగాణాకి నీటి కేటాయింపులు జరపాలని విజ్ఞ‌ప్తి చేశామ‌న్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్యనైనా, లేదంటే నదీపరివాహాల ప్రాంతాల్లోని మొత్తం రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరపాలని కోరామ‌ని, ఏడేళ్ల సమయం వచ్చినా ప్రధాన మంత్రికి రాసిన లేఖకు ఈ నాటికి స్పందన లేద‌ని మండిప‌డ్డారు. కేంద్ర ప్రభుత్వం నుంచ‌చి ఉలుకూ లేదు పలుకు లేద‌ని, పైగా అపెక్స్ సమావేశాల పేరిట ఏదో చేస్తున్నట్టు అనిపిస్తున్నార‌ని, కానీ ఏమీ చేయడం లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. 6న జరిగే సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా గట్టిగా ఎండగట్టాల‌ని, తెలంగాణాకు నీటి కేటాయింపుల విషయంలో స్పష్టత ఇవ్వాలని పట్టుపట్టాల‌ని అధికారుల‌కు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ న్యాయమైన డిమాండ్ల విషయంలో అవసరమైన అన్ని వాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

తెలంగాణ జోలికి ఏపీ రావొద్దు: కేసీఆర్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts