ఇది న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు బ్లాక్‌డే: అస‌దుద్దీన్ ఓవైసీ

September 30, 2020 at 3:14 pm

బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసుకు సంబంధించి ల‌క్నో సీబీఐ కోర్టు వెలువరించిన తీర్పుపై ఎంఐఎం నేత‌, ఎంపీ అస‌దుద్దీన్ ఓవైస్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ రోజు భార‌తీయ న్యాయ‌వ్య‌వస్థ‌కే బ్లాక్ డే అని ఆయ‌న అభివ‌ర్ణించారు. బాబ్రీ కేసులోని నిందితులంద‌రినీ అధ్వాని, ఉమాభార‌తి, ముర‌ళీమ‌నోహ‌ర్ జోషితో స‌హా 49 మందినిర్దోషుల‌కు ప్ర‌క‌టిస్తూ జ‌డ్జి సురేంద్ర‌కుమార్ యాద‌వ్ తీర్పునిచ్చిన సంగ‌తి తెలిసిందే. అదేవిధం గా ఆ ఘ‌ట‌న ముంద‌స్తు ప్లాన్ ప్ర‌కారం జ‌రిగింది కాద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ తీర్పుపై భిన్న‌వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ స్పందించారు.

ఓ మీడియా చాన‌ల్‌తో ఆయ‌న మాట్లాడుతూ.. బాబ్రీ కేసులోని నిందుతుల‌కు సీబీఐ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వ‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. భార‌తీయ న్యాయ చ‌రిత్ర‌లో ఈ రోజు బ్లాక్ డేగా నిలిచిపోతుంద‌ని తెలిపారు. బాబ్రీ కూల్చివేత‌లో కుట్ర లేద‌ని కోర్టు చెప్పిన‌ప్పుడు, ఆ ఘ‌ట‌న అప్ప‌టిక‌ప్పుడు జ‌రిగింద‌ని తేల్చేందుకు ఇన్ని సంవ‌త్స‌రాల‌ స‌మ‌యం ఎందుకు తీసుకున్నార‌ని ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికే ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింద‌ని, చ‌ట్టాల‌ను అతిక్ర‌మించార‌ని, ప్ర‌ణాళిక ప్ర‌కారమే ప్రార్థ‌నా మందిరాన్ని ధ్వంసం చేశార‌ని వెల్ల‌డించింద‌ని గుర్త‌చేశారు. మ‌సీదు కూల్చివేత‌కు కార‌ణ‌మైన వాళ్ల‌ను దోషులుగా తేల్చాల్సి ఉండెన‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. బాబ్రీ మ‌సీదు కూల్చివేత అంశంతోనే బీజేపీ అధికారంలోకి వ‌చ్చిందని ఓవైసీ తెల‌ప‌డం గ‌మ‌నార్హం.

ఇది న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు బ్లాక్‌డే: అస‌దుద్దీన్ ఓవైసీ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts