అష్టాచెమ్మా ఆట‌లో మోసం చేశాడ‌ని.. తండ్రిపై కోర్టులో కేసు

September 28, 2020 at 10:21 am

ఇప్ప‌టికే కోర్టుల్లో వేలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. క్రిమిన‌ల్‌, సివిల్ కేసులు వేల సంఖ్య‌లో పేరుకుపోయాయి. వాటిని ఎలా ప‌రిష్క‌రించాలో తెలియ‌క న్యాయ‌మూర్తులు ఇప్ప‌టికే త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. వీలైనంత త్వ‌రంగా వాటిని ప‌రిష్క‌రించేందుకు ప్ర‌త్యేకంగా కృషి కూడా చేస్తున్నారు. కానీ కొంద‌రు మాత్రం అయిన‌దానికీ, కానిదానికీ కోర్టును ఆశ్ర‌యిస్తూ విలువైన స‌మ‌యాన్ని వృథా చేస్తున్నారు. అలాంటి విచిత్ర సంఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌రిగింది. ఓ కూతురు వింత పిటిషన్‌ దాఖలు చేసింది. అష్టాచెమ్మా ఆటలో తండ్రి త‌న‌ను మోసం చేశాడని ఆరోపిస్తూ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

వివ‌రాల్లోకి వెళితే.. మ‌ధ్యప్రదేశ్‌ రాష్ట్రం భోపాల్‌లో ఈ విచిత్ర కేసు కోర్టుముందుకు చేరింది. తండ్రితో కలిసి అష్టాచెమ్మా ఆడ‌గా.. తప్పుగా ఆడి.. తనను మోసం చేసి తన తండ్రి గెలిచాడని ఆ పిటిష‌న్‌లో కూతురు పేర్కొన‌డం గ‌మ‌నార్హం. తనకు నాన్నంటే ఎంతో ఇష్టమని, ఆయనను ఎంతగానో నమ్ముతానని, కానీ, ఆటలో మోసం చేయడం తట్టుకోలేకపోతున్నానని ఆ ఫిర్యాదులో కూతురు పేర్కొన‌డం గ‌మ‌నార్హం. దీనిపై విచారించిన అధికారులు ఇద్దరినీ పిలిపించి నచ్చజెప్పారు. ఆ యువతికి కౌన్సిలింగ్ ఇచ్చినా ససేమిరా అంటుండ‌డం గ‌మ‌నార్హం. ఇప్పటికి నాలుగుసార్లు కౌన్సిలింగ్‌ ఇచ్చినట్లు కోర్టు సిబ్బంది తెలిపారు. ఇదిలా ఉండ‌గా.. కూతురి ఆనందం కోసం తండ్రి ఆ ఆటలో ఓడిపోతే బాగుండన్న భావనలో ఆ అమ్మాయి ఉందని కోర్టు వెల్లడించ‌డం కొస‌మెరుపు.

అష్టాచెమ్మా ఆట‌లో మోసం చేశాడ‌ని.. తండ్రిపై కోర్టులో కేసు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts