
నిద్రలో వచ్చేది కల. అజ్ఞాన నిద్ర నుంచి మేల్కోలిపేది కళ. మానవ పరిణామక్రమంలో.. విప్లవ పోరాటాల్లో కళలు.. కళాకారులు ఎంతటి క్రియాశీల పాత్రను పోషించారో తెలియంది కాదు. చిందుయక్షగానాలు , నాటకాలు ప్రజలను చైతన్యవంతం చేశాయి. స్వాతంత్య్ర పోరాటాలకు ప్రాతినిధ్యం కూడా వహించాయంటే ఆతిశయోక్తేమీ లేదు. తెలంగాణ సాయుధ రైతాంగం పోరాటమేకాదు.. నిన్నమొన్నటి మలిదశ ఉద్యమం కూడా అందుకు ఓ నిలువెత్తు నిదర్శనం. ఎప్పుడయితే ప్రపంచ యవనికపై సినిమా తెర లేచిందో అప్పటి నుంచి కళలు నిర్వహించిన పాత్రను సినిమా రంగం నిర్వహిస్తూ వస్తున్నది. సినీతారలు ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలుస్తున్న సందర్భాలు అనేకం. అంతే కాదు కరువులు, వరదలు తదితర సందర్భాల్లోనూ ఆదుకుంటున్నాయి. అంతటి ప్రభావంతమైనది సినిమా రంగం. అందులో టాలీవుడ్, కొలివుడ్, మాలివుడ్, శాండల్‌వుడ్ ఉన్నా బాలీవుడ్ పరిధి చాలా పెద్దది. దేశవ్యాప్తంగా ఎంతో ప్రభావితం చేయగలిగినది. అందుకు బీజేపీ ఇప్పుడు ఆ రంగంపై దృష్టిని కేంద్రీకరించింది. క్రమేణా.. ఏవిధంగానైనా బీటౌన్‌లో పాగా వేయాలని పన్నాగాలను పన్నుతున్నది. సామదాన దండోపాయాలను ఉపయోగిస్తూ ఆ దిశగా పట్టుసాధిస్తున్నది. ఈ పరిస్థితే ఇప్పుడు బాలీవుడ్ వర్సెస్ ఎన్డీఏ సర్కారు అనే పరిస్థితికి చేరుకున్నది. సినీతారలు నోరువిప్పని, తమ భావాలను స్వేచ్ఛగా చెప్పడానికి వీల్లేని దుస్థితికి చేరుకుంటున్నది. సృజనాత్మకతతో స్వేఛ్ఛగా సినిమాను నిర్మించలేని నిర్బంధ పరిస్థితి ఆవహిస్తున్నది. ఇప్పుడిదే విషయం బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఎన్డీఏ సర్కారు బాలీవుడ్‌పై ఎందుకు ఇంత కక్ష కట్టింది? అందుకు కారణాలు ఏమిటీ? అసలు బాలీవుడ్ నుంచి బీజేపీ సర్కారు ఏమి ఆశిస్తున్నది? సినీతారల గొంతును ఏవిధంగా నొక్కిపెట్టాలని కుయుక్తులను పన్నుతున్నది? అందుకోసం ఏవిధమైన నిరంకుశ విధానాలను అమలు చేస్తున్నది? ఎన్డీఏ ఎజెండా ఏమిటీ? ఇంత జరుగుతున్నా బీటౌన్ పెద్దలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అన్నవి ఇప్పటి ప్రశ్నలు.
ముందే చెప్పినట్లుగా సినిమా రంగం ఓ చైతన్య తరంగం. ఓ నటుడు.. ఓ సినిమా ప్రజలపై చూపగలిగే ప్రభావం చూపుతుందో తెలియంది కాదు. అయితే అది ప్రస్తుతం కమర్షియల్‌గా మారిన సంగతి విషాదకరం. వ్యాపార సంస్కృతి పెచ్చుమీరుతున్నది. అయినా సినీతారలకు.. సినిమాలకు మాత్రం ఆదరణ ఏ మాత్రం తగ్గడం లేదు. అది వేరే విషయం. అయితే చాలా మంది తారలు సామాజిక సమస్యలను పట్టించుకోనివారే. చాలా మంది తమ సినీ అవకాశాలు.. అవార్డులు.. రివార్డులు, వ్యక్తిగత అవసరాల కోసం ఆయా అధికార పార్టీలతో సన్నిహితులుగా మెలుగుతుంటారు. అలాంటి వారితో ప్రభుత్వాలకు ఏ విధమైన ఇబ్బందీ ఉండబోదు. వాళ్లను ఏ సర్కారు లెక్కలోకి తీసుకోదు. పైపెచ్చు పురస్కార కిరీటాలను బహూకరిస్తుంది. కానీ కొందరు ప్రగతిశీల వాదులు మాత్రం ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా తమ గళాన్ని వినిపిస్తుంటారు. బాధితులకు అండగా నిలబడుతుంటారు? అందులో సినీ నటులు ప్రకాశ్‌రాజ్, కమల్‌హాసన్, నానా పటేకర్, తెలుగు సినీ పరిశ్రమలోనయితే నారాయణమూర్తి వంటివారు పలువురు ముందువరుసలో ఉంటారు. కోలివుడ్లో నయితే అలాంటి వారి సంఖ్య కోకొల్లలుగా ఉంటారు. వారితోనే వస్తుంది ఇబ్బంది అంతా. ప్రభుత్వాలకు ప్రజాక్షేత్రంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యతిరేకతను పెంచుతాయి. ఇప్పుడు బీజేపీకీ అదే భయం పట్టుకుంది. అందుకే అది సినిమా రంగంపై దృష్టి సారించింది. ముఖ్యంగా అతిపెద్ద నెట్వర్క్ కలిగిన బీటౌన్ పైనే దాని ఫోకస్‌ను పెట్టింది. సినీతారలు తన చేయిదాటిపోకుండా కట్టుదిట్టం చేస్తున్నది.
బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశ రాజకీయ చిత్రమే మారిపోయింది. మతపరమైన దాడులు పేట్రేగిపోయాయి. జర్నలిస్టులు, కళాకారులపై, సామాజికవేత్తల హత్యలు కూడా కొనసాగాయి. అనేక ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నది. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ పేదలను నిర్లక్ష్యం చేస్తున్నది. మొదటి దఫా 2014లో అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఎన్డీఏ సర్కారుపై పలువురు బాలివుడ్ నటులు తీవ్రస్థాయిలోనే విరుచుకుపడ్డారు. ఒకనొక దశలో అవార్డులను సైతం వెనక్కి ఇవ్వాలనే ఉద్యమంలో క్రియాశీల పాత్రను పోషించారు. అసహనం పెరిగిపోతున్నదని ధ్వజమెత్తారు. అదేవిధంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగానూ గళం విప్పారు. ప్రస్తుతం రెండోదఫా అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ఇప్పుడు ఇంకా అనేక ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నది. ఏడాదిగా కశ్మీర్‌పై ఉక్కుపాదం మోపుతున్నది. రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీసే వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చింది. రాబోయే రోజుల్లో మరిన్ని కఠిన చట్టాలను తీసుకువచ్చే పనుల్లో నిమగ్నమైంది. ఇంకా విషయం ఏమిటంటే ఏకంగా అధ్యక్షపాలననే తీసుకువచ్చేందుకు వ్యూహాలను రచిస్తున్నది. రిజర్వేషన్లను కూడా రద్దుచేయాలని భావిస్తున్నది. ఇప్పటికే ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతున్నది. కొద్దిరోజులుగా యావత్ భారత రైతాంగం కేంద్ర సర్కారుపై కదం తొక్కుతున్నది. ఎన్డీఏ తీరుపై అసంతృప్తిని వ్యతిరేకిస్తూ ఏకంగా కేంద్రమంత్రి రాజీనామా చేశారంటే పరిస్థితి ఎంతగా దిగజారుతుందో అర్థం చేసుకోవచ్చు. అగ్నికి ఆజ్యం తోడయితే ఏమవుతుంది. ఆది దవానాలమవుతుంది. ఎంత పెద్ద కీకారణ్యాన్ని అయినా మసి చేసి పారేస్తుంది. ప్రజావ్యతిరేకతకు ప్రముఖుల, సెలబ్రిటీల మద్దతు దక్కితే ఏమవుతుంది. అది మొత్తంగా స్వల్పకాలంలోనే పరివ్యాప్తమవుతుంది. ప్రభుత్వ మనుగడకే ముప్పువాటిల్లుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బీజేపీ బీటౌన్‌పై నజర్ వేసింది. బాలీవుడ్ నటులు గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నది. అదీగాక ఇప్పటికే ప్రసార మాధ్యమాలను కార్పొరేట్ శక్తులకు ధారాధత్తం చేసిన బీజేపీ, తాజాగా సినీ రంగాన్ని కూడా ఓటీటీ వైపు మళ్లించాలని కుయుక్తులను కూడా వాడుతున్నది. అందుకే అదిప్పుడు బడాతారలపై దృష్టిని కేంద్రీకరిస్తున్నది.
అవకాశం ఎదురుచూస్తున్న బీజేపీకి ఇప్పుడు గొప్ప అవకాశం చిక్కింది. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును ఎన్డీఏ తన అవసరాల కోసం వాడుకుంటుంది. బీటౌన్‌ను పూర్తిగా తన ఆధిపత్యం కిందకు తెచ్చుకునే దండంగా ఉపయోగించుకుంటున్నది. సుశాంత్ కేసును అటు రాజకీయంగా వాడుకుంటుంది. సదరు నటుడు బీహార్‌కు చెందిన వాడు కావడం, ప్రస్తుతం అక్కడ అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలవుతుండడంతో ఓ కారణం. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కాదు మూడు పిట్టను కొట్టేలా ఎత్తులు వేసింది. ఆ కేసు ద్వారా బీటౌన్‌ను ఇటు తన దారికి తెచ్చుకునేందుకు, అటు బీహార్‌లోని రాజ్‌పుత్ ఓట్లను కొల్లగొట్టేందుకు, మరోవైపు రైతాంగ సమస్యలను మరుగున పరిచేందుకు వ్యూహాలను పన్నింది. ఈ నేపథ్యంలోనే మాములు ఆత్మహత్యగా మొదలైన కేసులో అనూహ్యంగా డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చింది. నార్కోటిక్స్ సెంట్రల్ బ్యూరో రంగంలో దిగిన తరువాత ఇప్పుడు ఏకంగా ప్రముఖతారల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. అందులో దీపికాపదుకునే, రిచా చద్దా పేర్లు ఉండడం ఇప్పుడు దుమారం రేపుతున్నది. ఇంకా టాలీవుడ్ నటి రకుల్‌ప్రీత్‌సింగ్ పేరు కూడా ఉంది. ఇంకా చాలామంది పెద్దతారలే ఉన్నారనే వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. ఇందులో దీపికా, రిచాచద్దా గతంలో బీజేపీపై మండిపడినవారే. సీఏఏ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన ఎన్టీయూలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేసినసందర్భంగా స్టూడెంట్స్ పక్షాన వారు తమ గళాన్ని వినిపించారు. బీజేపీకి ట్విట్లు చేసినవారే కావడం ఇక్కడ గమనార్హం. ఇక దర్శకుడు అనురాగ్ కశ్యప్ ను కూడా మహిళా వేధింపుల కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నది. సూటిగా చెప్పాలంటే ఇదంతా ఎందుకంటే సినీతారల గొంతునొక్కేందుకే. తమకు వ్యతిరేకంగా పనిచేసే ఎవరైనా జాగ్రత్త అంటూ బీటౌన్‌లోని వారిని హెచ్చరిందుకేనని దీనినిబట్టి తెలుస్తున్నది. ఇప్పుడే కాదు అధికారంలో వచ్చిన తొలినాళ్లలో ఇదే విధానాన్ని బీజేపీ అవలంభించింది. దేశంలో అసహనం పెట్రేగిపోతున్నది గళం విప్పిన అమీర్‌ఖాన్‌పై విరుచుకుపడింది. బీజేపీ నేతలు మండిపడ్డారు. ఇలాంటి వారికి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అది జరిగిన కొద్దిరోజులకే స్నాప్‌డీల్‌తో తనకు ఉన్న ఒప్పందాన్ని అమీర్ ఖాన్ కోల్పోవడం ఇక్కడ గమనార్హం. ఈ ఘటన తరువాత చాలా మంది బాలీవుడ్ పెద్దల నోళ్లు మూతపడ్డాయి. ఇప్పుడు తాజాగా డ్రగ్స్ కేసు పేరిట మొత్తం బాలీవుడ్‌నే తన హస్తగతం చేసుకునేందుకు చూస్తున్నదన్నదే ఇక్కడ అసలైన సత్యం. చాలా మంది బీటౌన్ పెద్దలు సైతం ఇదే విషయాన్ని బాహటంగా చెప్పకపోయినా తమలో తాము చర్చించుకుంటుండడం గమనార్హం.