ఢిల్లీ అల్ల‌ర్ల కేసులో ఇద్ద‌రు నిర్మాత‌లు..?

September 15, 2020 at 8:06 am

గతేడాది డిసెంబర్‌లో కేంద్రం తీసుకువచ్చిన ఎన్ సీపీఆర్‌, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 23 -26 వరకు దేశ‌రాజ‌ధానిలో చెలరేగిన హింసకు సంబంధించి ఢిల్లీ పోలీసులు పలు చార్జిషీట్లు దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖుల‌పై చార్జిషీట్ల‌ను న‌మోదు చేశారు. కొంద‌రిని అరెస్టు కూడా చేయ‌డం గ‌మ‌నార్హం. తాజాగా ఈ కేసులో డ్యాక్యుమెంటరీ చిత్రాల నిర్మాతలు రాహుల్ రాయ్, సబా దేవన్ పేర్లు వినిపిస్తుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బాలివుడ్ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్న‌ది. కేసు విచారణకు హాజరు కావాలని స‌ద‌రు నిర్మాత‌ల‌కు పోలీసులు ఇప్ప‌టికే నోటీసులు ఇచ్చారు. ఆ నిర్మాతలిద్దరు అల్లర్లకు మద్దతు తెలిపే ఓ వాట్సాప్ గ్రూప్‌లో సభ్యులుగా ఉండ‌డ‌మేగాక‌, విద్వేషాలు రెచ్చగొట్టే సందేశాల పంపార‌ని పోలీసులు వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలోనే విచారణకు హాజరు కావాలని పోలీసులు వారికి సోమవారం సమన్లు జారీ చేశారు. పోలీసులు నేడు వారిని విచారించనున్నారు.

ఇదిలా ఉండ‌గా.. ఇప్పటికే కేసులో జేఎన్‌యూ మాజీ విద్యార్థి నేత ఉమర్‌ ఖలీద్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అదేవిధంగా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, స్వరాజ్ అభియాన్ నాయ‌కుడు యోగేంద్ర యాదవ్, ఆర్థికవేత్త జయతీ ఘోష్, ఢిల్లీ యూనివర్సిటీ ఫ్రొఫెసర్ అపూర్వానంద పేర్లు కూడా అల్ల‌ర్ల కేసులో ఉన్నట్టు మీడియాలో ముమ్మరంగా ప్రచారం సాగుతున్న‌ది. కానీ పోలీసులు ఆ ప్రచారాన్ని ఖండించారు. ఫిబ్రవరిలో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు మొదలు కాగా.. అవి తర్వాత తీవ్ర రూపం దాల్చాయి. ఈ నెల 23 నుంచి 26 వరకు జరిగిన అల్లర్లలో 50 మందిపైగా చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఈ అల్ల‌ర్ల‌తో భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఇప్పటి వరకు 751 కేసుల్లో 1,575 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్లకు సంబంధించి 250కిపైగా చార్జిషీట్లు దాఖలు కాగా, అందులో 1,153 మంది నిందితులపై చార్జిషీట్ దాఖలు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఢిల్లీ అల్ల‌ర్ల కేసులో ఇద్ద‌రు నిర్మాత‌లు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts