వీఆర్ ఏ కుటుంబానికే కుల బ‌హిష్క‌ర‌ణ‌

September 23, 2020 at 10:10 am

సాంకేతిక ప‌రిజ్ఞానం కొత్త పుంత‌లు తొక్కుతున్నా కొంద‌రు చాంద‌స‌వాదులు, పెత్తందారులు తమ కుల జాడ్యాన్ని వ‌ద‌ల‌డం లేదు. కులం పేరిట అనైతిక‌, అమాన‌వీయ చ‌ర్య‌ల‌కు దిగుతూ స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునేలా చేస్తున్నారు. సాటి మాన‌వుల‌నే క్షోభ‌కు గురిచేస్తున్నారు. ఏకంగా వీఆర్ ఏ కుటుంబానికే కుల‌బ‌హిష్క‌ర‌ణ విధించ‌డ‌మేగాక‌, రూ. 20ల‌క్ష‌ల జ‌రిమానా క‌ట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారంటే స‌మాజంలో వారి ఆగ‌డాలు ఎలా మితిమీరుతున్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక సామాన్యుల ప‌రిస్థితి ఎలా ఉంద‌నే అంశాన్ని అవ‌గ‌తం చేసుకోవ‌చ్చు. వివ‌రాల్లోకి వెళ్లితే..

జ‌న‌గామ జిల్లా య‌శ్వంత‌పూర్‌‌కు చెందిన గ‌డ్డం ర‌వికుమార్ తండ్రి 1990 నుంచి వీఆర్ ఏగా ప‌నిచేస్తున్నారు. ఈ క్ర‌మంలో విధుల్లో ఉండ‌గానే 2010లో ఆయ‌న మ‌ర‌ణించాడు. దీంతో అత‌ని కుమారుడు గ‌డ్డం ర‌వికుమార్ పేరిట అధికారు అర్డ‌ర్ కాపీని ఇచ్చారు. నాటి నుంచి ర‌వికుమార్ వీఆర్ ఏగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌లే వీఆర్ ఏల‌కు పే స్కేల్ ఉద్యోగులుగా తీసుకుంటామ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన నాటి నుంచి అస‌లు చిక్కులు మొద‌ల‌య్యాయి. ఆ ఉద్యోగం త‌మ‌కు చెందుతుంద‌ని ర‌వికుమార్ స‌మీప బంధువులు బెదిరింపుల‌కు దిగుతున్నారు. ఇదే విష‌య‌మై పెద్ద‌మ‌నుషుల పంచాయ‌తీని పెట్టించారు. ఈ సంద‌ర్భంగా కులు పెద్ద‌లు క‌లిసి ఉద్యోగం చేయాలంటే రూ. 20ల‌క్ష‌లు ఇవ్వాల‌ని, లేదంటే ఉద్యోగం వ‌దులుకోవాల‌ని ర‌వికుమార్‌ను డిమాండ్ చేశారు. అందుకు స‌సేమిరా అన‌డంతో ర‌వికుమార్ కుటుంబాన్ని కుల బ‌హిష్క‌ర‌ణ విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ఎవ‌రైనా కుల‌స్తులు వారి కుటుంబంతో మాట్లాడినా, శుభ‌, అశుభ కార్యాల‌కు వెళ్లితే ఐదు చెప్పుదెబ్బ‌లతో పాటు గుండు గీకిస్తామ‌ని హుకుం జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. కుల బ‌హిష్క‌ర‌ణ‌తో త‌మ కుటుంబం అనేక అవ‌స్థ‌ల‌కు గుర‌వుతున్న‌ద‌ని, ఇప్ప‌టికైనా అధికారులు న్యాయం చేయాల‌ని బాధితుడు ర‌వికుమార్ కోరుతున్నారు.

వీఆర్ ఏ కుటుంబానికే కుల బ‌హిష్క‌ర‌ణ‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts