నేర‌డ్‌మెట్‌లో క‌ల‌కలం.. మిస్ట‌రీగా చిన్నారి అదృశ్యం

September 18, 2020 at 11:26 am

హైద‌రాబాద్ నేర‌డ్‌మెట్ సంతోషిమాత కాల‌నీలో క‌ల‌క‌లం చెల‌రేగింది. చిన్నారి అదృశ్యం ఘ‌ట‌న మిస్ట‌రీగా మారింది. బాలిక నాలాలో ప‌డి ఉంటుంద‌నే కోణంలో జీహెచ్ ఎంసీ అధికారులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. వివ‌రాల్లోకి వెళ్లితే.. నేర‌డ్‌మెట్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని సంతోషీమాత కాల‌నీకి చెందిన ఓ బాలిక నిన్న సాయంత్రం వేళ సైకిల్ తొక్కుకుంటానంటూ ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లింది. ఎంత‌కీ తిరిగి రాక‌పోవ‌డంతో త‌ల్లిదండ్రులు చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో, బంధువుల ఇళ్ల‌లో వెతికారు. దీంతో ఈ రోజు ఉద‌యం పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

రంగంలోకి అధికారులు సంతోషిమాత కాల‌నీ ప్రాంతాల్లో గాలింపు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో కాల‌నీలోని నాలా ప‌క్క‌న బాలికకు చెందిన సైకిల్‌ను గుర్తించారు. దీంతో బాలిక ఆ నాలా ప‌డిపోయి ఉంటుంద‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. వెంట‌నే జీహెచ్ ఎంసీలోని డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ బృందాన్ని రంగంలోకి దించి నాలాలో గాలింపు చేప‌ట్టారు. అయితే బాలిక చాలా జాగ్ర‌త్త‌గా ఉంటుంద‌ని, నాలా ప‌డిపోయి ఉండే అవ‌కాశం లేద‌ని, ఎవ‌రైనా కిడ్నాప్ చేసి సైకిల్‌ను అందులో ప‌డేసి ఉంటార‌ని చిన్నారి త‌ల్లిదండ్రులు తెలుపుతుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో బాలిక అదృశ్యం మిస్ట‌రీగా మారింది. విష‌యం తెలుసుకున్న మ‌ల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు హుటాహుటిన సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని గాలింపు ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

నేర‌డ్‌మెట్‌లో క‌ల‌కలం.. మిస్ట‌రీగా చిన్నారి అదృశ్యం
0 votes, 0.00 avg. rating (0% score)