విశాఖ‌లో క‌ల‌క‌లం.. కొత్త‌త‌ర‌హాలో సైబ‌ర్‌మోసాలు

September 30, 2020 at 3:32 pm

సాంకేతిక ప‌రిజ్ఞానం పెరిగినా కొద్దీ నేర‌గాళ్లు కూడా కొత్త ప‌ద్ధ‌తుల‌ను వెతుక్కుంటున్నారు. విభిన్న త‌ర‌హాలో మోసాల‌కు తెగ‌బ‌డుతున్నారు. అమాయ‌కుల‌ను బురిడీ కొట్టిస్తూ.. పోలీసుల‌కు స‌వాల్ విసురుతున్నారు. ఎంటీఎం, ఓటీపీ, క్లోనింగ్ త‌దిత‌ర ప‌ద్ధ‌తుల‌తో ఇప్ప‌టికే అనేక మోసాల‌కు పాల్ప‌డ‌గా, తాజాగా విశాఖ‌లో గిఫ్ట్ పేరుతో ఓ నేవీ అధికారిని మోస‌గించారు. భారీ మొత్తంలో సొమ్మును గుంజారు. అధికారుల తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం..

విశాఖ మహారాణిపేటలో ఉంటున్న ఓ వ్య‌క్తికి జూన్ 30న ఫేస్‌బుక్‌లో సాండ్రా జేమ్స్‌ నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. దానిని ఆయ‌న అక్సెప్ట్ చేశారు. అంతే నాలుగు రోజుల వ్యవధిలో ఆయనకు వాట్సాప్‌లో మెసేజ్‌లు రావ‌డం మొద‌ల‌య్యాయి. ఓ మహిళ ఆయనకు మాయ మాటలు చెప్పి గిఫ్ల్‌ పంపిస్తున్నానని నమ్మబలికింది. ఆ పార్సిల్‌కు సంబంధించిన రశీదును వాట్సాప్‌ చేసింది. జులై 13న అనిత అనే మహిళ ఆయనకు ఫోన్ చేసి ఢిల్లీలోని ఫారిన్‌ పార్సిల్‌ డిపార్ట్‌మెంట్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని.. పార్సిల్‌ను పంపేందుకు ఛార్జీల కింద‌ రూ.22,500 చెల్లించాలని చెప్ప‌డంతో ఆయ‌న‌ ఆ మొత్తాన్ని బ్యాంకు ద్వారా చెల్లించాడు. మరుసటి రోజు మళ్లీ ఫోన్ చేసి పార్సిల్‌ను స్కాన్‌ చేయగా అందులో లక్ష పౌండ్ల నగదు, ఐఫోన్‌, బంగారు వాచ్, యాపిల్‌ ల్యాప్‌టాప్‌, రెండు పెర్ఫ్యూమ్‌ సీసాలున్నాయని, వాటి విలువే సుమారు రూ.94 లక్షలు ఉంటుంద‌ని, రూ.1.05 లక్షలు చెల్లించి యాంటీ మనీలాండరింగ్‌ డాక్యుమెంట్‌ను తీసుకోవాలని తెలిపింది. భారీమొత్తంలో క‌లిసివ‌స్తున్న‌ద‌నే ఆశ‌తో ఆయన ఏమీ ఆలోచించ‌కుండా రూ. 1,63,79,420 చెల్లించారు. అటు త‌ర్వాత మోస‌పోయాయ‌ని తెలుసుకున్నాడు. ఈ విషయం సీబీఐ అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆయనకు ఫోన్‌ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించడంతో స‌ద‌రు బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

విశాఖ‌లో క‌ల‌క‌లం.. కొత్త‌త‌ర‌హాలో సైబ‌ర్‌మోసాలు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts