సీఐ పేరిటే ఫేక్ ఐడీ.. భారీ మొత్తంలో టోక‌రా..

September 21, 2020 at 6:37 pm

సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ కొంద‌రు మోస‌గాళ్లు త‌మ చేతివాటం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ సైబ‌ర్ కేటుగాళ్లు మామూలు ప్ర‌జ‌ల‌నే కాదు, ప్ర‌ముఖులను సైతం వ‌ద‌లడం లేదు. వారిపేట‌నే న‌కిలీ ఐడీల‌ను క్రియేట్ చేసి సుల‌భంగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి వారినే ప‌డ్డారు తుని పట్టణానికి చెందిన సీఐ. వివ‌రాల్లోకి వెళ్లితే.. తుని ప‌ట్ట‌ణానికి ఓ ప్ర‌ముఖుడు రోజువారీగా సోష‌ల్ మీడియాలో త‌న సైట్‌ను చూస్తున్నాడు. అంత‌లోనే త‌న ఫేస్‌బుక్‌లో తుని ప‌ట్ట‌ణ సీఐ నుంచి మెసేజ్ వ‌చ్చింది. నాకు అర్జంట్‌గా రూ.20వేలు కావాల‌ని, ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కానీ పంపాల‌ని దాని సారంశం. స‌ద‌రు ప్ర‌ముఖుడు ఆ సందేశాన్ని చూసి ఆశ్చ‌ర్య‌పోయినా సీఐనే క‌దా అని వెంట‌నే రూ.20వేల‌ను పంపారు. ఇలా తుని పట్టణానికి చెందిన చాలా మంది ప్రముఖులకు పోలీస్ అధికారుల పేర్లతో మెసేజ్‌లు వెళ్లాయి. సీఐ అడిగిన తర్వాత కాదనలేక పలువురు డబ్బులు వేశారు. ఇలా అనేకమంది లక్షల్లో మోసపోయారు.

ఇదిలా ఉండ‌గా.. అంద‌రిలాగానే మెసేజ్ అందుకున్న వారి లో ఒకరు తనకు ఫోన్ పే లేదని డబ్బులు ఎలా పంపాలని నేరుగా స‌ద‌రు పోలీస్ అధికారికే ఫోన్ చేశారు. ఆ వ్య‌క్తి చెప్పిన విష‌యం విని స‌ద‌రు అధికారి ఒక్క‌సారిగా కంగుతిన్నాడు. ఫోన్ చేసిన వ్యక్తి నుంచి వివరాలు సేకరించి విచారణ చేయగా త‌న పేరు మీద న‌కిలీ ఐడీ సృష్టించి సైబ‌ర్ నేర‌గాళ్లు మోసాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు గుర్తించాడు. త‌న‌తో పాటు మ‌రో ఇద్ద‌రు పోలీస్ అధికారుల పేరుతో ఈ నకిలీ దందా జిల్లా పోలీస్ శాఖ లో కలకలం రేపింది. సీఐ పేరిట‌నే కాదు చింతూరు డీఎస్పీ, తిమ్మాపురం ఎస్‌ఐ పేరుతోను కేటుగాళ్లు వారి ఫోటోలతోనే పేజీలు సృష్టించి డబ్బులు భారీగా గుంజేశారు. నేరగాళ్లు కొన్నిరోజుల కిందట ఫేస్‌బుక్‌లో ప్రత్యేకంగా పేజీ సృష్టించి ఎవరికీ అనుమానం రాకుండా వారి అసలు ఫోటోలే ప్రొఫైల్‌ ఫోటోలుగా పెట్టి ఆయా సర్కిల్‌ పరిధిలో రాజకీయ, వ్యాపార, ఇతర ప్రముఖులకు ముందుగా ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపారు. చాలామంది రిక్వెస్ట్‌ను అక్స‌ప్ట్ చేయ‌డం విశేషం. ఆ తర్వాత నుంచి ఆన్‌లైన్‌లో వారితో సదరు పోలీసు అధికారుల పేరుతో నేరగాళ్లు చాటింగ్‌ మొదలుపెట్టి ముగ్గులోకి దింపేవారు. ఇలా ఇప్ప‌టివ‌ర‌కు చాలా మందిని బుర‌డి కొట్టించారు. లక్షల్లో పిండేశారు. తాజాగా ఈ వ్యవహారం వెలుగులోకి రావ‌డంతో పోలీసులు అవాక్క‌య్యారు. తమపేరుతో ఉన్న నకిలీ ఖాతాలు చూసి అవాక్కయ్యారు. సైబర్‌ విభాగం అధికారులు రంగంలోకి దిగా ఆ కేటుగాళ్లు ఎవ‌ర‌ని తెల్చే ప‌నిలో నిమ‌గ్న‌య్యారు. అసలు విషయం తెలియడంతో ఇప్పుడు పలువురు బాధితులు లబోదిబోమంటున్నారు.

సీఐ పేరిటే ఫేక్ ఐడీ.. భారీ మొత్తంలో టోక‌రా..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts