
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నిన్నామొన్నటి వరకు స్తబ్దుగా సాగిన తెరవెనక మంత్రాంగాలు ఇప్పుడు బట్టబయలవుతున్నాయి. కేంద్రంతో ఉన్న సత్సంబంధాలు ఒక్కసారిగా బెడిసికొడుతున్నాయి. రాజకీయ పక్షాల మధ్య ఉప్పు నిప్పుగా పరిస్థితి మారిపోతున్నది. తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ పావులు కదుపుతుండగా ఆయా రాష్ట్రాల్లోని అధికార పక్షాలు ముందుగానే అప్రమత్తమవుతున్నాయి. కమలదళం ఎత్తులకు పై ఎత్తులను వేస్తున్నాయి. అస్ట్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అందులో భాగంగా అటు టీఆర్ఎస్, ఇటు వైసీపీలు పార్లమెంట్ వేదికగా తమ గళాన్ని గట్టిగా వినిపిస్తున్నాయి. మరి బీజేపీ వేస్తున్న ఎత్తులు ఏమిటీ? వాటిని తిప్పికొడుతూ కమలానికి చెక్ పెట్టేందుకు కేసీఆర్, జగన్ రచిస్తున్న వ్యూహాలు ఏమిటీ? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ముందుముందు ఇంకా ఏం జరగబోతున్నదోనని రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తిగా మారింది.
రెండోసారి అఖండ మెజార్టీతో బీజేపీ అధికారంలోకి అనంతరం బీజేపీ దూకుడుగా ముందుకు సాగుతున్నది. వచ్చేసారి పార్లమెంట్‌కు, అసెంబ్లీలకు జమిలిగా ఎన్నికలను నిర్వహించాలని కమలదళం ఇప్పటికే ప్రణాళికలను రూపొందించుకుంది. అటు తరువాత అధ్యక్ష తరహా పాలనను తీసుకురావాలని భారీ వ్యూహాలను పెట్టుకున్నది. అందుకు అనుగుణంగా యావత్ దేశంలో పార్టీని విస్తరించాలని ముందుగానే ఎత్తులు వేస్తున్నది. గత సాధారణ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కొంత మేరకు ఫలితాలు కమలదళంలో ఉత్సాహాన్ని మరింత నింపుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనైనా తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని వ్యూహాలను రచిస్తున్నది. ఇతర పార్టీలకు చెందిన నాయకులను, గట్టి ఆర్థిక మూలాలు ఉన్న వారిని నయానా, భయానా, కేసుల బూచిని చూపుతు, లేదంటే భారీ తాయిలాలను, పదవులను ఎరవేస్తూ తనవైపు ఒక్కొక్కరిగా లాగేసుకుంటున్నది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలకు అధ్యక్ష, కార్యదర్శలను బీజేపీ నియమించింది. అనంతరం ప్రస్తుతం వారు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వం చేపడుతున్న పనులకు అడ్డుపడుతూ తమ గళాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. తెలంగాణలో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో కమలనాథులు టీఆర్ఎస్పై విరుచుకుపడుతున్నారు. మాటకు మాట చెబుతున్నారు. ఇప్పటికే నిత్యం ఏదో ఒక అంశంపై ధర్నాలను పిలుపునిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగాను గులాబీపై, కేసీఆర్ విమర్శలు గుప్పిస్తూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. మొన్నామధ్య ఏకంగా అసెంబ్లీ ముట్టడికే పిలుపునిచ్చారు.
ఇటు ఏపీలోనయితే బీజేపీ మరింత దూకుడుగా ముందుకు సాగుతున్నది. బీజేపీ అధ్యక్షుడిగా ఇటీవలే సోము వీర్రాజును నియమించిన విషయం తెలిసిందే. నాటి నుంచి బీజేపీ కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలోని ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు కమలనాథులకు కలిసివస్తున్నది. దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీబీఐ విచారణకు ఆదేశించినా, బీజేపీ మాత్రం ధర్నాలతో హోరెత్తిస్తున్నది. అంతర్వేది ఘటనపై నానా హంగామా చేసింది. మతాన్ని ఎజెండాగా తీసుకునే ఏపీలో బీజేపీ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తున్నది. గతంలో టీడీపీ హయాంలో ఆలయంలో ఇలాంటి ఘటనలు జరిగినా స్పందించని బీజేపీ, ఇప్పుడు నానా హంగామా చేస్తుండడమే అందుకు నిదర్శనమని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు తమిళనాడులోనూ పాగా వేసేందుకు బీజేపీ వ్యూహాలను రచిస్తున్నది. ఈ నేపథ్యంలోనే చిన్నమ్మ శశికళను జనవరిలో బయటకు తీసుకువచ్చేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. చిన్నమ్మ ద్వారా తమిళనాడులో జెండా ఎగరవేయాలని బీజేపీ వ్యూహాలను పన్నింది. వచ్చే ఏడాది సాగే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు.
బీజేపీ వ్యూహాలను ముందుగానే పసిగట్టిన టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ దీటుగానే పావులు కదుపుతున్నారు. కమలనాథుల ఎత్తులను చిత్తు చేసేలా పావులను కదుపుతున్నారు. జాతీయ స్థాయిలో పార్టీని స్థాపించేందుకు అడుగులు వేస్తున్నారు. అందుకు ఇప్పటికే కార్యచరణ సిద్ధం చేసుకున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జోరుగా కొనసాగుతున్నది. మరోవైపు వైసీపీ కూడా బీజేపీపై దూకుడుగానే ముందుకు సాగుతున్నది. అందులో భాగంగా టీఆర్ ఎస్, వైసీపీలు బీజేపీతో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. కమలనాథులకు ఎక్కడికక్కడ చెక్ పెట్టేందుకు పావులను కదుపుతున్నాయి. అందులో భాగంగానే ఎవరికి వారుగా తమ ఎజెండాలతో బీజేపీపై ఎదురుదాడికి దిగుతున్నాయి. తిరుగుబావుటాను ఎగరేస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో రెండు తెలుగు రాష్ట్రాల అధికారపార్టీలు తమ గళాన్ని గట్టిగానే వినిపిస్తున్నాయి. ఒకరు రాష్ట్రం కోసం పోరాడుతూటే మరొకరు కోర్టులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి పార్లమెంట్ సమావేశాల్ని ఉపయోగించుకుంటున్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో రెండు రాష్ట్రాల ఎంపీలు ధర్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన బకాయిల కోసం నిరసన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్రాంతీయ పార్టీలతో కలిసి టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేశారు. 9 ప్రాంతీయ పార్టీల పార్లమెంట్ సభ్యులను ఏకం చేయడంలో టీఆర్ ఎస్ అక్కడ విజయం సాధించింది.
అయితే ఈ ఆందోళనలో దేశంలో మూడో అతి పెద్ద పార్టీ, ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ అయిన వైసీపీ ఎంపీలు పాల్గొనలేదు. అలా అని వారు.. ఖాళీగా లేరు. వారు కూడా నిరసన వ్యక్తం చేశారు. అయితే వారి ప్లకార్డులపై మాత్రం భిన్నమైన నినాదాలున్నాయి. అమరావతి కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని.. ఫైబర్ నెట్ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలనేది ఆ ప్లకార్డులపై డిమాండ్లు ఉన్నాయి. వైసీపీ ఎంపీల తీరు ఇతర రాష్ట్రాల ఎంపీలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. అందరు ఎంపీలు తమ తమ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం ఆందోళనలు చేస్తూంటే.. వీరు మాత్రం..సీబీఐ విచారణ కోరడం ఏమిటన్న చర్చ జోరుగా కొనసాగుతున్నది. మిగతా ప్రాంతీయ పార్టీలతో కలిసి ముందుకు సాగకపోవడంలో ఆంతర్యం ఏమిటని విశ్లేషణలు చేస్తున్నారు. ప్రభుత్వం సిఫార్సు చేసి పంపితే.. కేంద్రం సీబీఐ విచారణ చేయిస్తుంది. దాని కోసం పార్లమెంట్ సమావేశాల సమయాన్ని వృథా చేసుకుని నిరసన వ్యక్తం చేయడం విడ్డూరంగా మారింది. వైసీపీ అధినేతపై ఉన్న కేసుల వల్లనే ఆయన కేంద్రంపై ఇంకా దూకుడుగా ముందుకు సాగడం లేదని పలువురు భావిస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఎలాంటి అడుగులు వేస్తారన్నది ఆసక్తిగా మారింది.