అసహనమా..? అతి ప్రయత్నమా..? కరణం వెనుక కారణం ఏంటి..??

September 3, 2020 at 4:15 pm

గన్నవరంలో వల్లభనేని వంశీ ఇప్పటి వరకు దుట్టా వర్గంపై.., పార్టీలోని నాయకులపై వ్యాఖ్యలు చేయలేదు..!!

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి… వైసీపీలో చేరి తన పని తాను చూసుకుంటున్నారు..!!

కానీ చీరాలలో ఏమిటీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి..? కరణం కత్తులు దూస్తున్నారు. ఎందుకిలా సవాళ్లు చేస్తున్నారు..? కొత్త హామీలు ఇస్తున్నారు..?? నిన్న వైఎస్ వర్ధంతి వేదికపై ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు పార్టీలోనూ, బయటా చర్చకు దారి తీస్తున్నాయి. కానీ వేదికపై, లేని సందర్భం చూసుకుని… వ్యాఖ్యలు చేయడం వెనుక అంతరార్ధం ఏమిటా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న..!!

అసహనమా..? అతి ప్రయత్నమా..? ఉనికి కోసమా..??

ఆమంచి కృష్ణమోహన్ ఆ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి. కరణం బలరాం ఎమ్మెల్యే. వెంకటేష్ ఒక నాయకుడు. ముగ్గురూ ఒకే పార్టీ. ఆమంచి ఆ పార్టీలో ఒక ఏడాది సీనియర్., ఆ నియోజకవర్గంలో పదిహేనేళ్ల పాటూ రాజకీయంగా గట్టి పునాదులు వేసుకున్న లీడర్. వీరిలో ఒకరిపై ఒకరు పిర్యాదు చేసుకోవాలన్నా, విమర్శించుకోవాలన్నా పార్టీలో అంతర్గతంగానే జరగాలి. ఏమైనా ఉంటె అధిష్టానం వద్ద చూసుకోవాలి. ఎవరిపై ఎవరు మాట్లాడినా అది పార్టీకే నష్టం. కానీ ఇవేమి గుర్తించక కరణం వెంకటేష్ రెచ్చిపోయారు. “నియోజకవర్గానికి స్వేచ్ఛనిస్తాను, బెదిరింపులకు లొంగం” అంటూ వ్యాఖ్యలు చేశారు. అసలే నివురుగా ఉన్న నియోజకవర్గంలో రెచ్చగొట్టేలా మాట్లాడడం ఆయనలో అంతర కోణాన్ని బయటకు తీస్తుంది.

పార్టీలో చేరి… తమ పని తాము చూసుకోకుండా పెత్తనం కోసం చర్చలు జరుపుతున్నారు. సీఎం జగన్ నమ్మకం గెలుచుకోలేదు, పూర్తిస్థాయిలో వైసీపీ వాదిగా మారనే లేదు. తమ పూర్వ పార్టీ టీడీపీ రంగులు ఇంకా పూర్తిగా వీడనే లేదు.. అప్పుడే వైసీపీలో పెత్తనం కోసం సొంత పార్టీలో కీలక నాయకుడ్ని టార్గెట్ చేశారు. ఇవి కూడా అసందర్భంగా రాజకీయం కానీ వేదికపై నోరు జారారు. పెత్తనం లేక వచ్చిన అసహనమో.., పెత్తనం కోసం అతి ప్రయత్నమో.., తామున్నామని ఉనికి కోసమో కానీ వెంకటేష్ వ్యాఖ్యలు కొందరికి సిల్లీగానూ.., కొందరికి వెగటుగానూ.., కొందరికి రెచ్చగొట్టేలాగానూ అనిపించాయి.

వెంకటేష్ అలా మాట్లాడితే ఆమంచి ఊరుకుంటారా..? కరణం రాకని ఆమంచి మొదటి నుండి వ్యతిరేకించలేదు, పార్టీ నిర్ణయమే అంటూ సైలెంట్ గా ఉన్నారు. “వైసీపీలో వాళ్ళ నిజాయితీ నిరూపించుకోనీ” అంటూ చెప్తూ వస్తున్నారు. కానీ నిన్న వెంకటేష్ వ్యాఖ్యలపై ఆయన కూడా ఘాటుగా స్పందించారు. “జగన్ కాళ్ళు పట్టుకుని వైసీపీలో చేరారు. అధికారం లేకుండా బతకలేక వచ్చేసారు. నా పేరు కూడా పలకడానికి భయపడే వాళ్లు” అంటూ తిరిగి కౌంటర్ ఇచ్చారు. ఇవి ఇక్కడితో ఆగుతాయా..? పార్టీ ఎలా పరిగణిస్తుంది అనేది కీలకంగా మారింది.

టీడీపీపై ఎందుకు మాట్లాడలేదు..!!?
రాష్ట్ర వ్యాప్తంగా నిన్న వైఎస్ వర్ధంతి నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని చోట్లా నేతలు వైఎస్ పాలనను గుర్తు చేసుకుంటూ.., జగన్ పాలనను ఆకాశానికి ఎత్తుతూ.., టీడీపీని విమర్శిస్తూ వచ్చారు. ఆ వేదికకు అదే కరెక్ట్. నాడు వైఎస్ కీ, నేడు వైసిపికి ప్రధాన ప్రత్యర్థి టీడీపీనే… అందుకే ఆ పార్టీని టార్గెట్ చేశారు. కానీ చీరాలలో కరణం వెంకటేష్ మాత్రం సొంత పార్టీ నాయకున్ని టార్గెట్ చేసారు. టీడీపీని, చంద్రబాబుని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడే కాదు టీడీపీ నుండి వైసీపీలో చేరి ఇప్పటికి అయిదు నెలలు దాటినప్పటికీ ఆ పార్టీని ఏమాత్రం విమర్శించకుండా చీరాలలో రాజకీయం చేసుకొస్తున్నారు కరణం..!! మరి ఇదెక్కడి వ్యూహంలో..? ఇదేం రాజకీయమో..??!

అసహనమా..? అతి ప్రయత్నమా..? కరణం వెనుక కారణం ఏంటి..??
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts