ఆన్‌లైన్ క్లాసుల కోసం మొబైల్ చోరీ..

September 23, 2020 at 9:42 am

క‌రోనా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను కుప్ప‌కూల్చ‌డ‌మేకాదు.. స‌మాజంలో వింత పోక‌డ‌ల‌కు తెర తీస్తున్న‌ది. ఇప్ప‌టికే కుటుంబ క‌ల‌హాల‌కు దారి తీస్తున్న‌ది. కొవిడ్ నేప‌థ్యంలో విద్యాల‌యాలు ప్రారంభం కాని ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. కొన్ని రాష్ట్రాల్లోని స్కూల్లు మాత్రం ఆన్‌లైన్ క్లాసుల‌ను నిర్వ‌హిస్తున్న‌ది. అయితే అండ్రాయిడ్ ఫోన్ కొనే ఆర్థిక స్థోమ‌త లేని ఓ కుర్ర‌వాడు వ‌క్ర‌మార్గం ప‌ట్టాడు. ఆన్‌లైన్ క్లాసుల‌ను వినేందుకు మొబైల్ ఫోన్‌ను చోరి చేయ‌డం విచార‌క‌రం. స‌ద‌రు విద్యార్థిని ప‌ట్టుకున్న ఓ మ‌హిళా పోలీస్ అధికారి ఆ బాలుడిలో మార్పు తెచ్చేందుకు ఓ నిర్ణ‌యం తీసుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తారు. బాలుడికి మొబైల్ ఫోన్‌ను కొనివ్వ‌డం విశేషం. వివ‌రాల్లోకి వెళ్లితే..

తమిళనాడు రాష్ట్రంలోని తిరువొత్తియూరుకు చెందిన‌ 13 ఏళ్ల విద్యార్థి స్థానిక కార్పొరేషన్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. బాలుడి తండ్రి బిస్కెట్ కంపెనీలో, తల్లి ఇంటి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పేదరికంలో ఉన్న వారికి త‌మ కుమారుడు ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు సెల్‌ఫోన్ కొనుగోలు చేయడం కష్టంగా మారింది. ఇదిలా ఉండ‌గా ఆ బాలుడిని ఎలాగైనా త‌మ‌తో చేర్చోకోవాల‌ని బాలుడి ఇంటి సమీపంలో ఉండే ఇద్దరు నేరస్థులు ఇదే అదునుగా భావించారు. పిల్లాడు తమతో ఉంటే దొంగతనాలు చేయడం కొద్దిగా తేలికగా అవుతుందని భావించారు. పోలీసులకు చిక్కినా పిల్లాడి సింపతి వర్కౌట్ అవుతుంద‌నుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆన్‌లైన్ క్లాసుల కోసం సెల్‌ఫోన్ కొనలేని పరిస్థితుల్లో ఉన్న ఆ విద్యార్థిని త‌మ మార్గంలోకి తీసుకొచ్చారు. చోరీ ఎలా చేయాలో శిక్షణ ఇచ్చారు. అయితే చోరీ చేస్తున్న క్రమంలోనే స‌ద‌రు బాలుడు అక్క‌డే గస్తీలో ఉన్న క్రైమ్ ఇన్‌స్పెక్టర్ భువనేశ్వరికి చిక్కాడు. బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించ‌గా అసలు నిజాలు వెలుగుచూశాయి. దీంతో చ‌లించిన స‌ద‌రు మ‌హిళా అధికారి సెల్‌ఫోన్ కొనిచ్చి, ఇంకెప్పుడూ దొంగతనాలు చేయకూడదని కౌన్సిలింగ్ ఇచ్చారు. బాలుడిని వ‌క్ర‌మార్గం ప‌ట్టించిన ఇద్ద‌రు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశాడు. చోరీలే కాదు ఆన్‌లైన్ క్లాసుల పుణ్య‌మాని కుటుంబంలోని చిన్నారుల మ‌ధ్య క‌ల‌హాలు కూడా పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఒకే సెల్ ఫోన్ ఉండ‌డంతో నాకు కావాలంటే నాకు కావాలంటూ ఉన్న ఇద్ద‌రు పిల్ల‌లు గొడ‌వ‌ల ప‌డుతుండ‌డం త‌ల్లిదండ్రుల‌ను క‌ల‌చి వేస్తున్న‌ది.

ఆన్‌లైన్ క్లాసుల కోసం మొబైల్ చోరీ..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts