
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్వేది రథ నిర్మాణంలో అగ్నికుల క్షత్రియులను భాగస్వాములను చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అంతర్వేది ఆలయ రథాన్ని గుర్తు తెలియని దుండగులు దహనం చేయడం, ఇది వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే సీబీఐ విచారణకు ఆదేశించింది వైసీపీ ప్రభుత్వం. అదీగాక ఆలయ రథాన్ని ప్రభుత్వమే నిర్మింపజేస్తుందని, అందుకు ఇప్పటికే రూ.95లక్షల నిధులను కూడా మంజూరు చేసింది.
ఇదిలా ఉండగా.. ఆలయ రథం దహనంపై పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నిరసనగా ఒక రోజు దీక్షకూడా చేపట్టారు. తాజాగా మరోసారి పవన్ కల్యాణ్ ఈ వివాదంపై నోరువిప్పారు. ఆలయ పూజల్లో ప్రధానంగా అగ్నికుల క్షత్రియులు ప్రధాన పాత్ర పోషిస్తారని, రథం దహసం ఘటనతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పవన్ వివరించారు. ఇప్పటికైనా ఆలయ నిర్మాణంలో అగ్నికుల క్షత్రియులను ప్రభుత్వం భాగస్వాములను చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారాయి.