
చే గువేరా వారసుడినంటాడు. విప్లవాలను పలవరిస్తాడు. బహుజనులకు బలమంటాడు. ఆచరణలో పెత్తందార్ల అడుగులకు మడుగులొత్తుతాడు. కార్లలో తిరుగుతాడు. సాధారణ చెప్పులు వేసుకుని నడుస్తున్న ఫొటోలకు ఫోజులిస్తాడు. ఇవన్నీ రీల్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించే. జనసేన పార్టీ అధినేత..కాకపోతే ఆ పార్టీకి ఆయనే నాయకుడూ ఆయనే కార్యకర్తా. అప్పుడప్పుడు ఏదైనా సంచలన సంఘటన జరగగానే.. మీడియా ముందుకు వస్తారు.. హల్ చల్ చేస్తారు. అటు తరువాత మళ్లీ కొన్నాళ్ల వరకు కనుమరుగవుతారు. నిజంగా చెప్పాలంటే ఆయనను ఓ పార్ట్ టైమ్ పొలిటీషియన అనుకోవచ్చు. సరే అదీ ఏమైనా అంకితభావంతో చేస్తున్నారా అంటే అదీ లేదు. ఎప్పటికప్పుడు తన రాజకీయ అపరిపక్వతను మాటల్లో చేతల్లో చూపుతూ జనంలో అభాసుపాలు అవుతున్నారు. వల్లేవేసే మాటలకు, పొంతనలేని చేతలకు చిరునామాగా నిలుస్తూ తన పరువు తానే తీసుకుంటున్నారు. పవన్ వింత చేష్టలు రోజురోజుకూ శృతి మించిపోతున్నాయి. ఆయన పరువును పబ్లిక్ లో పలుచబరుస్తున్నాయి. రియల్ లైఫ్‌లో జోకర్లా నిలబెడుతున్నాయి. జనాలకు నవ్వులు తెప్పిస్తున్నాయి. జనసేన పార్టీని స్థాపించిన తొలినాళ్లలో అంటే ఏమో అనుకోవచ్చు. కానీ ఇప్పటికీ అదే తరహాలో వ్యవహరిస్తుండడం నిజంగానే హస్యాన్ని తెప్పిస్తున్నది. దానివల్లే ఆయన అపహాస్యం పాలవుతున్నారు. ఎప్పటికప్పుడు తాను ఓ అపరిపక్వత కలిగిన నేతగానే నిరూపించుకుంటున్నాడు తప్ప ప్రజల నమ్మకాన్ని ఏమాత్రం పొందలేక పోతున్నాడు. పార్టీ పెట్టిన తొలినాళ్లలోనే కాపు రిజర్వేషన్ ఇష్యూ సందర్భంగా కేరళలో సినిమా చిత్రీకరణను రద్దు చేసుకుని ఆగమేఘాల మీద వచ్చి మరీ ప్రెస్ మీట్ పెట్టారు. అది మంచిదే కానీ. రిజర్వేషన్ అనే సున్నితమైన ఇష్యూపై మాట్లాడేప్పుడు దాని గురించి కనీసం అధ్యయనం చేయాలి కదా. అదీ చేయలేదు సరే.. ఆ ఇష్యూ గురించి నాకు పూర్తిగా అవగాహనం లేదు.. నాకు అంతగా తెలియదు.. అని మీడియా ముందే మాట్లాడి తనపై ప్రజల్లో అప్పటి వరకు ఉన్న కొద్ది విశ్వాసాన్ని కూడా పొగొట్టుకున్నారు.
ఇక మొన్నటి సాధారణ ఎన్నికల వేళ టీడీపీతో బహిరంగంగా పొత్తు పెట్టుకోకపోయినా తెరవెనక పొత్తు పెట్టుకొని ప్రజల ముందుకొచ్చి ప్రజలతో చీత్కరింపజేసుకున్నాడు. చంద్రబాబుతో తెరవెనక పొత్తును కప్పిపుచ్చడంలో పూర్తిగా విఫలమవడమేకాదు, తన మాటలతోనే ఆ రహస్యాన్ని ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూ ప్రజల్లో చులకనయ్యాడు. అధికారంలో ఉన్న చంద్రబాబు, లోకేష్ ను కాకుండా ప్రతిపక్ష నేత జగన్ మోహన్‌రెడ్డిని టార్గెట్ చేయడంలో గల ఆంతర్యాన్ని ప్రజలు సులభంగానే అర్థం చేసుకున్నారు. ప్రజలకు ఓ కామెడీ పీస్ గా మారిపోయారు. రాయలసీమలో హెలికాప్టర్ ల్యాండింగ్ కు జగన్ అనుమతివ్వలేదని, కడపలో బహిరంగ సభ కోసం ఏర్పాటుచేసిన స్టేజీని జగన్ తొలిగించారని, చివరికి తిరుపతిలో ప్రచారం చేద్దామంటే జగన్ వల్ల పోలీసులు సహకరించలేదని విచిత్ర ఆరోపణలను చేస్తూ తన పరువు తానే తీసుకున్నారు పవన్. ఇక ప్రచారంలోనూ నులక మంచంలో కూర్చోవడం, సాధారణ చెప్పులను ధరించడం, మట్టి కుండలో నీళ్లు తాగడం వంటి ఫోజులిచ్చి తాను సామాన్యుడినని ప్రజలకు తెలిపేందుకు నానా తంటాలు పడ్డారు. కానీ తన పక్కన వాటర్ బాటిళ్లను కవర్ చేయకపోవడంతో మరోసారి నవ్వుల పాలయ్యారు. ప్రసంగాల్లో ఆవేశంతో ఊగిపోవడం, స్టేజీలపైనా హీరోలానే వెంట్రుకలు ఎగిరేయడం వంటి బాలచేష్టలతో వినోదం పంచారు.
ఇప్పుడు తాజాగా మరోసారి పవన్ తన ఇమేజ్ను డ్యామేజ్ చేసుకున్నారు. అంతర్వేది ఘటన సందర్భంగా పవన్ చేష్టలు రోత పుట్టించేలా ఉన్నాయి. అసలు పవన్‌కు ఏ సిద్ధాంతాలు లేవని తేల్చిచెబుతున్నాయి. రథం దగ్ధం ఘటన నిరసనగా జ్యోతిప్రజ్వలన, మౌనదీక్ష అంటూ చేపట్టి తన అవివేకాన్ని మరోసారి బట్టబయలు చేసుకున్నారు. అవేమైనా తప్పా అంటే కాదు. కానీ ఆయన వల్లేవేసే వాటికి అవి విరుద్ధం కావడమే ఇక్కడ గమనార్హం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను చేగువెరాను ఆదర్శంగా తీసుకున్నానని చెబుతూ ఉంటారు. పుస్తకాలు చదివేటప్పుడు రక్తం మరిగిపోతూంటుందని.. ఆవేశ పడుతూంటారు. కానీ ఆచరణలో అందుకు విరుద్ధం. మతం పేరుతో కొత్తగా రాజకీయం చేయడానికి ఏ మాత్రం సిగ్గుపడకపోవడమే అందుకు నిదర్శనం. తనవి కమ్యూనిస్టు భావాలని చెబుతూ, మరోవైపు మోడీ అంటే ఇష్టమన్నారు. ఆ కలయికనే ఊహించలేనిది. తనను మించిన హిందూత్వ వాది లేరన్నట్లుగా… పువ్వుల్లో దీపాలు పెట్టి హడావుడి చేయడం.. తానో మేధావిననే భావన కలిగించేలా పుస్తకాలు చదువుతున్న ఫోటో షూట్లు చేసుకోవడం రోత పుట్టిస్తున్నాయి. చివరికి అది కామెడీగా మారింది. పవన్ కల్తీ భావజాలాన్ని బట్టబయలు చేశాయి. మరో ముఖ్యవిషయం పవన్ కల్యాణ్ తన ఫోటో షూట్లో పెట్టిన పుస్తకాల పేర్లు చూసి.. మేధావులకు దిమ్మతిరుగుతొంది. ఎందుకంటే… ఆ పుస్తకాలు చదివిన .. అర్థం చేసుకున్న వారందరూ… సంస్కృతి గురించి… సంప్రదాయాల గురించి.. సనాతన ధర్మాల గురించి… సమాజంతో వ్యవహరించాల్సిన పద్దతులపై ఓ అవగాహనకు వస్తారు. రాజకీయం చేసుకోవచ్చని.. ప్రజల సెంటిమెంట్లతో ఆడుకోవచ్చని అందులో చెప్పలేదు. కానీ పవన్ కల్యాణ్‌కు అలాగే అర్థమయినట్లుంది. అందుకే అలా చేస్తున్నారు. చదవేస్తే ఉన్న మతి పోయిందన్నట్లుగా ఇలాంటి పుస్తకాలన్నీ చదివేసి.. తాను అనుకున్నదే అందులో ఉందనుకుని ముందుకెళ్లూ ఎప్పటికప్పుడు బొక్కబోర్లా పడుతున్నారు పవన్. అభిమానులు సైతం అసహ్యించుకునేలా తయారవుతున్నారు. ఇకనైనా పవన్ ప్రవర్తనలో.. ఆలోచనల్లో..ఆ మేధావితనం రావాలి. ఆ పుస్తకాలను నిజంగానే చదివి అర్థం చేసుకున్నానని ప్రజలకు..తన నిర్ణయాలు.. పోరాటాలు.. ఆలోచనలతోనే నిరూపించాలి. లేకపోతే మరో పాల్ అవుతారు. జనాలు ఇప్పటికే అలా చర్చించుకుంటుండడం గమనార్హం.