
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ గుట్టు బయటపడటంతో.. రంగంలోకి దిగిన నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తీగ లాగితే డొంక కదిలినట్లు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని చిత్ర పరిశ్రమల్లో ప్రముఖల పేర్లు బయటపడుతున్నాయి.
ఇప్పటికే సుశాంత్ కేసులో ప్రధాన ఆరోపణులు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిని, ఆమె సోదరుడు షోవిక్‌ను అరెస్ట్ చేసింది. రియా ఫోన్ డేటా ఆధారంగా పలువురు బాలీవుడ్ హీరోయిన్లను కూడా విచారించబోతోంది. ఇందులో భాగంగా.. బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్‌కు ఎన్సీబీ తాజాగా సమన్లు కూడా అందించింది. అయితే దీనిపై స్పందించిన రకుల్ ఊహించని షాక్ ఇచ్చింది.
తనకు ఎలాంటి నోటీసులు అందలేదని రకుల్ చెప్పుకొచ్చింది. తనకు హైదరాబాద్, ముంబైలో ఎక్కడా ఎన్సీబీ నుంచి సమన్లు అందలేని తన మేనేజర్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేయించి ఆశ్చర్యపరిచింది. దీంతో రకుల్ చేసిన వ్యాఖ్యలను ఎన్సీబీ సీనియర్ అధికారి కేపీఎస్ మల్హోత్రా కొట్టిపారేశారు. తాము ఆమెకు నోటీసులు జారీ చేశామని.. కానీ, ఆమె నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదని చెప్పారు. ఆమె ఈ రోజు కూడా విచారణకు హాజరు కాలేదని వివరించారు.