వ‌రుణుడు..”ప‌వ‌నుడు”

September 2, 2020 at 10:22 am

చినుకు గారి ప‌ల‌కరింపు చాలా కాలానికి.. దేవుడెందుకో ఇయ్యాల ఇలా ప‌ల‌క‌రించాడేమో! ప్ర‌కృతి త‌త్వం తెలుసుకునేందుకు ఏం లేదు కానీ.. అనుభ‌వించేందుకు ఎంతో ఉంది. మార్థ‌వం ఉంది. మాధుర్యం ఉంది. ఆమె గారెవ్వ‌రో పాడిన పాట మాదిరి ఉంది. వాట్ నాట్ / వాట్ ఎల్స్‌. ఒక‌డు ప‌వ‌నుడు.. ఒక‌డు వ‌రుణుడు. ఒక‌డు మ‌న‌సుకు .. ఒక‌డు మ‌ట్టికి చేరువ‌. ప‌రిమ‌ళించే క్ష‌ణం నాకొక అద్భుతం. నా త‌ల్లి న‌ను దీవించే క్ష‌ణం ప‌ర‌మాద్భుతం.

###
వానొచ్చి దాగుడుమూత‌లాడుతోంది. వీచే ప‌వ‌నం విసుగెందుకో ఇస్తుంది. ఎండ‌లు.. ఆగ‌స్టులో ఎండ‌లు.. ఎండ‌లు.. సాయంత్రం ఆరు దాటుతున్నా న‌డినెత్తిన ఇంకా సూరీడా..? వ‌ద్దు బాబోయ్ వద్ద‌న్నా విన‌డే..! ఇంకా మాన్ సూన్ క‌మింగ్ సూనేనా! ఉద‌యం ఆరైతే చాలు భ‌గ్గున మండిపోతున్నాడే.. దిగ్గున లేచి విసురుగ పోతున్నాడే.. ఇలాంటివేళ మ‌న పాపం మ‌న‌కెందుకు గుర్తుకురాదు. మ‌న‌కిదే ఎందుకు శాపం అని తోచ‌దు. మ‌నిషి మ‌ట్టికి దూరం.. మ‌నిషి మ‌న‌సుకు దూరం. ఆమె కోసం చేస్తున్న ప్ర‌తి ప్ర‌యాణం భారం..భారం.

###
సెల్సియ‌స్ ఓ మానం.. సెన్సిటివ్‌నెస్ నా భావోద్వేగానికి ప్ర‌మాణం. నా..క‌న్నీరు చెంత వ‌రుణుడు. నాలో..త‌నను క‌లిపేసుకున్నాడు. న‌వ్వుల జ‌డి చెంత ప‌వ‌నుడు. నువ్వే నేనన్నాడు. కొంత‌కాలంగా పొగ‌రు సూరీడుకు.. ఎందుకో.. కొంత‌కాలంగా ఇటుగా ఎందుకనో ఎర్ర‌గించి..గిల్లిగిచ్చి.. చూస్తున్నాడు. సంపేత్తున్నాడు. నేల నెర్రెలు విచ్చుకునేలా చూస్తున్నాడు. గ‌డిచిన కాలంలో.. చేను న‌వ్విందా? లేదు క‌దా! పాల‌కంకో / పిల్ల ఎంకో న‌వ్విందా! లేదు క‌దా! ప్ర‌శ్నే ప‌ర‌మావధిగా సా..గుతోందా..? స‌నాత‌న‌మేదో.. త‌న త‌నం విడిచి ఎక్క‌డో మూల‌న దాక్కుందా? బాస్ వైదికం గొడ‌వెందుకు కానీ.. ఇదిగో చినుకు గారొచ్చారుగా.. కాసేపలా ఆడుకొన‌నీ..

###
ప‌వ‌న్ ఫ‌ర్ ఎవ‌ర్‌.. ప‌వ‌ర్ ఫ‌ర్ ఎవ‌ర్‌. మిస్ట‌ర్ వ‌రుణా! మాతో..మ‌రికాసేపు ఉండ‌వ‌య్యా! మాకు మేముగా గిరిగీసుకున్న గీత‌లు చెరిపేసే క్ర‌మాన.. దారిద్ర్యం పొలిమేర‌ను దాటించే క్ర‌మాన మాతో పాటు నువ్వు కూడా తోడుండ‌వ‌య్యా. ప్రేమో.. క‌ల‌హ‌మో..విర‌హ‌మో.. మాతోనో / మాలోనే ఉంచేసి అట్టా వెళ్లిపోతావే. వ్య‌క్తం కానివి కొన్ని దాచుకుని ఏం లాభం.? వ్య‌క్తీక‌రించి కొన్నింటిని దాటుకుంటేనే జీవన గ‌మ‌నం అత్యంత సునాయ‌స భ‌రితం. ఇంత‌వ‌ర‌కూ మాలో స‌త్య‌మ‌స‌త్యాలు కొన్ని.. ప్ర‌ణ‌య కాల భారాలు కొన్ని.. వీటితో పాటు ఇంకొన్ని. వీటిని ఏమంటారు? ప‌వ‌న్‌ని అడిగితే “స్వ‌ల్ప భారాల‌ను.. స‌మీప దూరాల‌ను భ‌రించ‌మంటున్నాడే”. “చూసే పెద‌విని.. మాట్లాడే క‌నుల‌ని నిదుర‌పొమ్మ‌ని ఆదేశిస్తున్నాడే..” నాలో నింగిని దాచేసుకొమ్మంటున్నాడే. ఏమో! ప‌వ‌నుడు.. వ‌రుణుడు .. ఇంకా మ‌రికొన్ని మిణుగురుల్లాంటి ఆలోచ‌న‌లు మ‌నోవ‌ల్మీక‌మున‌. వెల్ క‌మ్ చెప్పాలో లేదో తెలియట్లే..!

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

వ‌రుణుడు..”ప‌వ‌నుడు”
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts