అక్క‌డి నుంచే శాండ‌ల్‌వుడ్‌కు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా!

September 18, 2020 at 10:10 am

శాండ‌ల్‌వుడ్‌లో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం రేపుతున్న‌ది. ఇప్ప‌టికే ప‌లువురు తార‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండ‌గా.. డ్రగ్స్‌ దందాలో దక్షిణ ఆఫ్రికా పౌరులే కీల‌కంగా ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది. శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసులో వారే సూత్రధారులని సీసీబీ అంచ‌నాకు వ‌చ్చింది. అందులో ముఖ్య నిందితుడు లూమ్‌ పెప్పర్‌ సాంబాను సీసీబీ పోలీసులు 15 రోజుల క్రిత‌మే అరెస్ట్ చేసిన‌ట్లు స‌మాచారం. పెప్పర్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం బెనాల్డ్‌ ఉడేన్నా అనే ఆఫ్రికన్ ను అరెస్ట్ చేసిన‌ట్లు తెలుస్తున్న‌ది. అతనిని విచారించ‌గా కీల‌క స‌మాచారం ల‌భించిన‌ట్లు పోలీసులు వివ‌రిస్తున్నారు. శాండ‌ల్‌వుడ్‌కు చెందిన తార‌ల‌తో ప‌లువురు ప్ర‌ముఖుల‌కు మత్తు పదార్థాలను తామే సరఫరా చేస్తున్నట్లు ఒప్పుకున్న‌ట్లు తెలుస్తున్న‌ది. ఉడేన్నా ఆదిత్య ఆళ్వాకు చాలా సన్నిహితుడని, డ్రగ్స్‌ నిందితులు రవిశంకర్, వీరేన్‌ ఖన్నాలు ఉడేన్నాతో నిత్యం సంప్రదించేవాడని, బెంగళూరుతో పాటు చుట్టు ప‌క్కల రిసార్ట్‌లో మధ్యరాత్రి వరకు జరిగే పార్టీలకు మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింద‌ని సీసీబీ పోలీసులు వివ‌రిస్తున్నారు. ఆదిత్య ఆళ్వకు చెందిన రిసార్ట్‌పై సీసీబీ పోలీసులు దాడి చేశారు. లూమా, ఉడేన్నాల వెన‌క కూడా ఒక పెద్ద తలకాయ ఉన్నట్లు సీసీబీ గుర్తించింది. వారిద్దరిని అరెస్ట్‌ చేస్తుండగానే ముగ్గురు కింగ్‌పిన్‌లు పరారు కావడంతో కేసుపై సీసీబీ గోప్యత పాటిస్తున్న‌ట్లు స‌మాచారం. ఆ ముగ్గురు దొరికితే మరెంతోమంది క్లయింట్ల పేర్లు బయట పడవచ్చ‌ని తెలుస్తున్న‌ది.

డ్ర‌గ్స్ కేసులో జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డిలో ఉన్న న‌టీమ‌ణులు రాగిణి, సంజ‌న‌ను ప‌ర‌ప్ప‌న అగ్ర‌హార జైలుకు త‌ర‌లించారు. కొవిడ్ నేప‌థ్యంలో ముందస్తుగా చ‌ర్య‌ల్లో భాగంగా అక్కడ క్వారంటైన్‌లోనే ఉంచారు. పుస్తకాలను చదువుతూ ఇద్ద‌రూ కాల‌క్షేపం చేస్తుండ‌డం విశేషం. రాగిణికి వెన్నునొప్పి సమస్య ఉండటంతో జైలు వైద్యులు ఔషధాలను అందించారు. రాగిణి, తల్లి, న్యాయవాదులను అధికారులు కలవనివ్వడం లేదు. కానీ ఫోన్లో మాట్లాడడానికి అవకాశమిచ్చారు.డ్ర‌‌గ్స్ దందాలో పేరు వినిపిస్తున‌న న‌టి ఐంద్రితా రై ను ప‌లువురు మీడియా ప్ర‌తినిధులును ప్రశ్నించ‌గా.. కేసుపై నేను ఏమీ మాట్లాడకూడద‌ని, సీసీబీ అధికారుల‌ విధించిన నియమాలను పాటించాలి జ‌వాబివ్వ‌డం గ‌మ‌నార్హం. మ‌రో న‌టుడు దిగంత్‌ సినిమా షూటింగ్‌లకు వెళ్లవచ్చని, కానీ బెంగళూరు విడిచి వెళ్లరాదని చెప్పారన్నారు. కాగా, రాధారమణ సీరియల్‌ నటి శ్వేతాప్రసాద్‌ తనపై తప్పుడు ప్రచారం చేయవద్దని, డ్రగ్స్‌ కేసులో జైలుకెళ్లిన ఒక నటితో కలిసిఉన్న పోటో మీద అసభ్యంగా పోస్టింగ్‌లు పెట్టవద్దని మీడియాను కోర‌డం గ‌మ‌నార్హం.

అక్క‌డి నుంచే శాండ‌ల్‌వుడ్‌కు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts