ఎస్పీ బాలు మ‌ర‌ణంపై సినీ ప్ర‌ముఖ‌ల ‌దిగ్భ్రాంతి!

September 25, 2020 at 3:38 pm

బహుభాషా గాయకుడు, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గ‌త యాబై రోజులుగా మృత్యువుగా పోరాడి పోరాడి.. నేటి మధ్యాహ్నం 1.04 గంటలకు చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. గురువారం సాయంత్రం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు ప్రకటించగా, అప్పటినుంచి ఆయన పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది.

అయితే నేడు అందరినీ తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ మధుర గాయకుడు తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు. దీంతో చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌న్నీ శోక‌సంద్రంలో మునిగిపోయాయి. ఇక బాలు పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం చెన్నైలోని సత్యం థియేటర్‌ వద్ద ఉంచనున్నారు. మ‌రోవైపు బాలు మృతిపై సినీ ప్ర‌ముకులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు.

తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకు పైగా,16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ , పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త తీవ్రం గా కలచివేసింది. ఈ భువి లో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే అని జూనియ‌ర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.

`నా ప్రియమైన బాలు, సంగీత ప్రపంచంలో నిశ్శబ్దం ఆవరించింది.. సరిగమలన్నీ కన్నీళ్లు పెడుతున్నాయి.. రాగాలన్నీ మూగబోయాయి.. నువ్వు లేని లోటు తీర్చలేనిది` అని రాఘవేంద్రరావు ట్వీట్ చేశారు.

`ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంగారు లేరనే నిజాన్ని నమ్మలేకపోతున్నాను. ఆయనలాంటి వాయిస్‌ ఎవరికీ ఉండదు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయన లెగసీ అమరం. ఆయన కుటుంబానికి నా సంతాపాన్ని ప్రకటిస్తున్నాను` అని మ‌హేష్ బాబు ట్వీట్ చేశారు.

`ఎప్పుడూ చిరునవ్వులు చిందించే మన ఎస్పీబీ గారు ఇకలేరనే వార్త విని షాక్‌కు గురయ్యాను. మన ఇండస్ట్రీకి ఆయన లేని లోటు ఊహకందడంలేదు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను` అని రామ్ చ‌ర‌ణ్ ట్వీట్ చేశాడు.

గుండె బద్దలైనట్టుగా ఉంది. సంగీత ప్రపంచానికి ఇదొక చీకటి రోజు. బాలుగారి మరణంతో ఒక శకం ముగిసిపోయింది. అద్భుతమైన స్వరంతో తనకు ఎన్నో మధురమైన పాటలను బాలు అందించారు.. తన విజయంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. తన మధురమైన గానంతో భాష, సంస్కృతుల సరిహద్దులను చెరిపేశారు. బాలుగారి స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరు.. త‌న‌ మరణం ద్వారా ఏర్పడిన శూన్యాన్ని పునర్జన్మ ద్వారా ఆయనే భర్తీ చేస్తారు అని చిరు పేర్కొన్నారు.

ఎస్పీ బాలు మ‌ర‌ణంపై సినీ ప్ర‌ముఖ‌ల ‌దిగ్భ్రాంతి!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts