
అనుమానంతో తీగ లాగితే డొంకంత కదిలింది. అంతరాష్ట్ర దొంగల ముఠా భారీ స్కెచ్ బయటపడింది. విచారణలో దొంగలు వెల్లడించిన విషయాలను విని పోలీసులు విస్మయం వ్యక్తం చేశారు. ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లోనే చోరీ భారీ స్కెచ్ వేసినట్లు సదరు దుండగులు తెలపడంతో అధికారులు అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు మేడా వెంకట మల్లికార్జునరెడ్డి కి కడప జిల్లా రాజంపేటలో ఒక ఇల్లు ఉన్నది.
రోజువారీగా ఆ ఇంటి వద్ద గస్తీ కాస్తున్న పోలీసులకు కొందరు అక్కడ సంచరిస్తుండడంపై అనుమానం కలిగింది. దీంతో పోలీసులు చాకచక్యంగా మొత్తం 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా అసలు విషయం వెలుగుచూశాయి. దుండగుల స్కెచ్‌కు నివ్వెరపోయారు. వారు మాములు దొంగలు కాదని, అంతర్రాష్ట్ర దొంగల ముఠాని గుర్తించారు. వారు గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, అనంతపురంతో పాటు కర్ణాటకలోని బళ్లారిలో కూడా భారీ దొంగతనాలు చేసినట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. దొంగల వద్ద నున్న ఒక పిస్టల్, 4 రౌండ్ల బుల్లెట్స్, కారు, 3 బైక్‌లు, 15 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. 2018 సంవత్సరంలో అదే వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్ మణికొండలోని పంచవీటి కాలనీలోని రోజా ఇంట్లో దొంగలు పడ్డారు. సుమారు రూ.10లక్షలు విలువచేసే బంగారం, డైమండ్ ఆభరణాలను ఎత్తుకుపోయారు. అప్పట్లో రోజా ఎన్నికలు, ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్ల చెన్నై, నగరిలో ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో హైదరాబాద్‌లోని ఇంట్లో దొంగలు పడడం గమనార్హం.