డిగ్రీ, పీజీ ప్ర‌వేశాల‌పై యూజీసీ కీల‌క ప్ర‌క‌ట‌న‌

September 23, 2020 at 8:49 am

కరోనా నేప‌థ్యంలో మీమాంస‌లో ప‌డిన విద్యాసంవ‌త్స‌రంపై ఎట్ట‌కేల‌కు స్ప‌ష్ట‌త వ‌చ్చింది. ఈ మేర‌కు యూజీసీ (యూనివ‌ర్సిటీ గ్రాంట్ క‌మిష‌న్‌) కీల‌క ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. డిగ్రీ, పీజీ కాలేజీల ప్రారంభానికి గ్రీన్ సిగ్న‌ల్‌ను ఇచ్చింది. కొత్త‌గా అకడమిక్‌ క్యాలెండర్‌ను ప్రకటించింది. అక్టోబ‌ర్ 31 వ తేదీలోగా క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశాల‌ను ముగించి, నవంబరు 1 నుంచి ఫ‌స్టియ‌ర్ తరగతులను నిర్వహించాలని యూనివర్సిటీలకు స్ప‌ష్ట‌మైన ఆదేశాల‌ను జారీ చేసింది. సిల‌బ‌స్‌ను పూర్తి చేసేందుకు శీతాకాల, వేసవి సెలవుల్లో కోతలు విధించాలని, వారానికి ఆరు రోజులు పాఠాల‌ను బోధించాల‌ని, తద్వారా నష్టపోయిన విద్యా సమయాన్ని భర్తీ చేయొచ్చని దిశానిర్దేశం చేసింది.

ఇదిలా ఉండ‌గా.. మొదటి సంవత్సరం విద్యార్థులకు సంబంధించి తొలి రెండు సెమిస్టర్ల పరీక్ష తేదీలను ఇప్పటికే యూజీసీ ప్రకటించింది. కరోనా నేపథ్యంలో దేశమంతటా 7 నెలలుగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. అన్‌లాక్ 4లో స్కూళ్లకు అనుమతించడంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయి. ఇక డిగ్రీ, పీజీ కాలేజీలు సైతం ప్రారంభం కానున్నాయి. అయితే ఒక‌వైపు క‌రోనా కేసులు పెరుగుతున్న స‌మ‌యంలో కాలేజీలను ప్రారంభించ‌డ‌మేమిట‌ని త‌ల్లిదండ్రులు మండిప‌డుతున్నారు. కొవిడ్ నేప‌థ్యంలో పార్ల‌మెంట్‌, అసెంబ్లీ స‌మావేశాల‌ను వాయిదా వేసుకుంటున్న నేత‌లు, విద్యార్థుల జీవితాల‌ను మాత్రం అగాథంలోకి తోస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు ఇప్ప‌టికే స్కూళ్ల ప్రారంభానికి కేంద్రం అనుమతిచ్చినా చాలా చోట్ల తెరుచుకోని ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. త‌మ చిన్నారుల‌ను పాఠ‌శాల‌ల‌కు పంపేందుకు ఇప్ప‌టికీ త‌ల్లిదండ్రులు ససేమిరా అంటుండ‌డం గ‌మ‌నార్హం. వ్యాక్సిన్ వ‌చ్చాక‌నే పంపుతామ‌ని ముక్త‌కంఠంతో చెబుతున్నారు. ఇటీవ‌ల కేంద్రం నిర్వ‌హించిన ఓ స‌ర్వే నివేదిక సైతం ఇదే విష‌యాన్ని వెల్ల‌డించ‌డం విశేషం.

డిగ్రీ, పీజీ ప్ర‌వేశాల‌పై యూజీసీ కీల‌క ప్ర‌క‌ట‌న‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts