దుర్గ‌గుడి ట్ర‌స్ట్ స‌భ్యురాలి కారులో అక్ర‌మ మ‌ద్యం..

September 30, 2020 at 7:15 pm

ఏపీలో కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్‌కే మద్యాన్ని పరిమితం చేస్తామని, రాబోయే రోజుల్లో పూర్తిగా మ‌ద్యాన్ని నిషేధిస్తామ‌ని సీఎం జ‌గ‌న్ ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చారు. ఈ మేర‌కు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ధరల‌ను భారీగా పెంచారు. అటుత‌రువాత ఇటీవ‌ల లాక్‌డౌన్ ఎత్తేసిన త‌రువాత ఏకంగా మద్యం ధరల‌ను 50 శాతానికి పెంచారు. ఈ ఏడాది షాపుల‌ను కూడా 20శాతం మేర త‌గ్గించేందుకు అడుగులు వేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా.. రాష్ట్రంలో మ‌ద్యం ధ‌ర‌లు పెర‌గ‌డంతో ఇత‌ర రాష్ట్రాల నుంచి అక్ర‌మంగా మ‌ద్యం భారీగా స‌ర‌ఫ‌రా అవుతున్న‌ది. తెలంగాణ‌, ఇత‌ర రాష్ట్రాల నుంచి అక్ర‌మ మ‌ద్యం ఏపీకి య‌థేచ్ఛ‌గా కొన‌సాగుతున్న‌ది. ఇప్ప‌టికే ప‌లువురు వివిధ మార్గాల్లో మ‌ద్యాన్ని స‌ర‌ఫ‌రా చేస్తూ పోలీసుల క‌ళ్ల‌ను క‌ప్పుతున్నారు. సిలిండ‌ర్ల‌లో, పాల‌వ్యాన్ల‌లో సైతం మ‌ద్యాన్ని త‌ర‌లిస్తుండ‌డం దందా ఏవిధంగా కొన‌సాగుతున్న‌దో అర్థం చేసుకోవ‌చ్చు.

తాజాగా విజయవాడ దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు చక్కా వెంకట నాగ వరలక్ష్మికి చెందిన కారులో అక్రమ మద్యం వెలుగుచూడ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తెలంగాణలోని మద్యం షాపుల్లో విక్రయించే మద్యం బ్రాండ్లు అందులో ఉండ‌గా, వాటి విలువ సుమారు రూ.40వేలు ఉంటుందని పోలీసులు అంచ‌నా వేశారు. నాగ వరలక్ష్మి భర్త వరప్రసాద్, కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు వెంకట నాగ వరలక్ష్మికి చెందిన జగ్గయ్యపేటలోని నివాసంలో పోలీసులు ఈ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం తెలంగాణ నుంచి ఇంత భారీ ఎత్తున మద్యాన్ని తీసుకొచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. తెలంగాణలోని మద్యం దుకాణాల్లో సరుకుని కొన్న తర్వాత జాతీయ రహదారి మీద నుంచి కాకుండా ఇతర పల్లెటూర్లలో నుంచి ఏపీలోకి మద్యాన్ని అక్ర‌మంగా తరలించినట్టు అధికారులు గుర్తించారు. జగ్గయ్యపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఏపీ ఈ కారులో భారీ ఎత్తున మద్యం ఉన్నట్టు పోలీసులకు సమాచారం రావడంతో అక్కడ త‌నిఖీల‌ను నిర్వ‌హించారు. అపార్ట్‌మెంట్ కింద పార్కింగ్‌లో ఉన్న కారుని ప‌రిశీలించ‌గా, అందులో పెద్ద ఎత్తున మద్యం బయటపడ‌డం గ‌మ‌నార్హం. పవిత్రమైన ఆలయానికి ట్రస్టు బోర్డు సభ్యురాలి కారులో మద్యం ల‌భించ‌డం, అది కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం కావ‌డం రాజ‌కీయంగా దుమారం రేపుతున్న‌ది. ఈ ఘటనపై ఇంకా నాగ వరలక్ష్మి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ట్రస్టు బోర్డు కూడా దీనిపై స్పందించాల్సి ఉంది.

దుర్గ‌గుడి ట్ర‌స్ట్ స‌భ్యురాలి కారులో అక్ర‌మ మ‌ద్యం..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts