ఏజెన్సీలో అల‌జ‌డి.. మూడురాష్ట్రాల డీజీపీల భేటీ

October 4, 2020 at 1:54 pm

ఏజెన్సీ ప్రాంతంలో అల‌జ‌డి నెల‌కొన్న‌ది. భారీగా పోలీసులు మోహ‌రించ‌డంతో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌క ఆదివాసులు హైరానా ప‌డుతున్నారు. అదీగాక తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, చ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ట్రాల డీజీపీలు భేటీకావ‌డంతో మ‌రింత హైఅల‌ర్ట్‌గా మారింది. అస‌లు ఏజెన్సీలో ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. ఆదివాసులు బిక్కుబిక్కుమంటూ కాలం గ‌డుపుతున్నారు. అయితే తెలంగాణ‌, చ‌త్తీస్‌ఘ‌డ్‌, మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దు ప్రాంతంలో ఈ మ‌ధ్య కాలంలో మావోల క‌ద‌లిక‌లు ఎక్కువ‌య్యాయి. తిరిగి తెలంగాణ‌లో అడుగుపెట్టేందుకు మావోలు భారీ వ్యూహాల‌ను ర‌చించార‌ని తెలుస్తున్న‌ది. అందులో భాగంగా ఎక్కువ సంఖ్య‌లో మావోలు తెలంగాణ స‌రిహ‌ద్దులోని అడ‌వుల‌కు చేరుకున్నార‌ని స‌మాచారం. అదీగాక ఇటీవ‌ల వ‌రుస‌గా పోలీసులు, మావోల‌కు ఎదురుకాల్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో ఇప్ప‌టివ‌ర‌క‌కు 10 మంది మావోలు ప్రాణాల‌ను కోల్పోయారు. దీంతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అదీగాక ద‌క్షిణ భార‌త అడ‌వుల్లో ఇస్లామిక్ ఉగ్ర‌వాద సంస్థ పాగా వేసేందుకు ఎత్తులు వేస్తున్న‌ద‌ని ఇటీవ‌ల కేంద్ర నిఘా సంస్థ స‌మాచారం ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఇప్ప‌టికే కుమ్రం భీం జిల్లాలో ఆయ‌న ప‌ర్య‌టించారు. ఐదురోజుల పాటు అక్క‌డే ఉండి ప‌రిస్థితి స‌మీక్షించారు. పోలీసుల‌కు ప‌లు కీల‌క ఆదేశాల‌ను జారీ చేశారు. అదేవిధంగా భ‌ద్రాచ‌లం జిల్లాలోనూ ప‌ర్య‌టించారు. నెల తిర‌గ‌క‌ముందే డీజీపీ మ‌రోసారి ఏజెన్సీలో ప‌ర్య‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వెంక‌టాపురంలో చ‌త్తీస్‌ఘ‌డ్‌, మ‌హారాష్ట్ర ల‌కు చెందిన డీజీపీల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. మావోల క‌ద‌లిక‌ల‌ను, వారిని అడ్డుకునేందుకు అనుస‌రించాల్సిన ఉమ్మ‌డి వ్యూహాల‌పై చ‌ర్చించ‌నున్నారు. ఇదిలా ఉండ‌గా.. పోలీసుల మోహ‌రింపు, భారీ కూంబింగ్‌ల‌తో ఏజెన్సీలో అల‌జ‌డి నెల‌కొన్న‌ది. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితుల్లో ఆదివాసులు భ‌యాందోళ‌న‌ల‌కు గురవుతున్నారు.

 

ఏజెన్సీలో అల‌జ‌డి.. మూడురాష్ట్రాల డీజీపీల భేటీ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts