భారీ జరిమానాలపై అచ్చెన్న సంచలన వ్యాఖ్యలు..  

October 22, 2020 at 3:37 pm

భరత్ అనే నేను సినిమాలో ఉన్నట్లుగానే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, వాహనదారులకు భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. నిబంధనలు ఉల్లంగించిన వారికి భారీ ఫైన్లు విధించాలని నిర్ణయించుకున్నారు. వాహన జరిమానాలు పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవో ప్రకారం.. ఇకపై బైక్‌లు, ఆటోలు, క్యాబ్‌ల నుంచి 7 సీటర్ కార్ల వరకూ ఒకే విధమైన జరిమానా విధించనున్నట్లు జగన్ సర్కార్ ప్రకటించింది. కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం ఎవరైనా సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా మొదటిసారి పట్టుబడితే రూ. 2 వేలు, రెండోసారి పట్టుబడితే రూ.5 వేలు జరిమానా విధించనున్నట్లు వెల్లడించింది.

అలాగే పర్మిట్ లేని వాహనాలు నడిపితే రూ. 10 వేలు, ఓవర్‌లోడ్‌కు రూ. 20 వేలు జరిమానా విధింస్తామని పేర్కొంది. ప్రమాదకర డ్రైవింగ్‌ చేస్తే రూ.10,000, రేసింగ్‌లో మొదటిసారి పట్టుబడితే రూ. 5 వేలు, రెండో సారికి రూ. 10 వేల జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ప్రభుత్వం పెంచిన జరిమానాలపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎడమచేత్తో ఇచ్చి, కుడిచేత్తో అంతకు రెట్టింపు గుంజుకోవడమే జగన్ సంక్షేమ విధానం అని, మోటారు వాహన చట్టంలో సవరణలు తీసుకొచ్చి వాహనదారులపై భారం వేశారని ఆరోపించారు.

రవాణా రంగాన్ని జగన్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టడం దుర్మార్గమని, ఈ 16 నెలల్లో కొత్తగా రోడ్డు వేయలేదు, ఉన్నవాటికి మరమ్మతులు చేయలేదని తెలిపారు. వాహనదారులపై విధించిన భారీ జరిమానాలు వెంటనే రద్దు చేయాలని, సంక్షోభంలో ఉన్న రవాణా రంగాన్ని ఆదుకోవాలని అచ్చెన్న డిమాండ్ చేశారు.

 

భారీ జరిమానాలపై అచ్చెన్న సంచలన వ్యాఖ్యలు..  
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts