
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నోటిఫికేషన్ వెలువడే సమయం దగ్గర పడుతున్న కొద్దీ వేడిక్కెత్తున్నది. మరోవైపు అధికార జేడీయూ, బీజేపీ, ఎల్జీపీ కూటమి, ఇంకోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలను రచిస్తున్నారు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో తలమునకలయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ పక్షాల సీట్ల పంపకాల విషయమైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి పక్షాలు ఆదివారం ఢిల్లీలో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకున్నారు. సీట్ల సర్దుబాటు, ప్రచార వ్యూహం తదితర అంశాలు ఓ కొలిక్కి వచ్చినట్టే కనబడుతున్నది. చర్చల్లో భాగంగా జేడీయూ చీఫ్, సీఎం నితీష్‌కుమార్ ఓ అడుగు వెనక్కి తగ్గి బీజేపీతో కలిసి చెరి సగం సీట్లలో పోటీ చేసేందుకు అంగీకారం తెలిపినట్టు సమాచారం. రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుండగా 122 సీట్లలో అధికార జేడీయూ, 121 సీట్లు బీజేపీ తమ అభ్యర్థులను పోటీకి దింపే దిశగా డీల్ కుదుర్చుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పట్నాలో జేడీయూ, బీజేపీల సీనియర్ నేతలు మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చలు విజయవంతంగా ముగిసినట్టు అనధికార వర్గాలు తెలుపుతున్నాయి. జేడీయూకి కేటాయించిన 122 సీట్లలోని 5 నుంచి 7 చోట్ల హిందుస్తానీ అవామ్ మోర్చా(హెచ్ఏఎమ్) అభ్యర్థులు పోటీ చేస్తారని, బీజేపీ వద్దనున్న121 సీట్లలోని కొన్నింటిని లోక్ జన శక్తి (ఎల్జేపీ)కి సర్దుబాటు చేసేలా ఈ చర్చల్లో ఓ అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.
ప్రతిపక్ష నేతలు సైతం భారీ స్థాయిలోనే కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కూటమిని కట్టేందుకు కాంగ్రెస్, ఆర్జేడీ, బీఎస్పీ ముందుకు వచ్చాయి. అయితే అందులో ఆర్జేడీ పార్టీ అధ్యక్షుడు తేజస్వీ యాదవ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ప్రకటించడంపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కూటమి పొత్తు చివరి వరకు ఎటు మలుపుతిరుగుతుందోనని ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఎన్డీఏ కూటమికి రాం రాం చెప్పేందుకు లోక్ జనశక్తి పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. తమకు కనీసం 42 సీట్లయినా ఇవ్వాల్సిందేనని ఎల్జేపీ పట్టుబడుతుండుగా, 15కు మించి ఇవ్వలేమని బీజేపీ చేతులెత్తేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాము కోరినన్ని సీట్లివ్వని పక్షంలో స్వతంత్రంగానే 143 సీట్లలో పోటీకి దిగుతామని ఎల్జేపీ బాస్ చిరాగ్ పాశ్వాన్ బాహటంగా ఎన్డీఏకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో బీజేఈ-ఎల్జేపీ మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఆసక్తికంగా మారింది.