కూతురు, ఆమె బిడ్డ‌ను పూడ్చిపెట్టిన త‌ల్లి

October 12, 2020 at 5:50 pm

అది తెలంగాణ రాష్ట్రం జ‌గిత్యాల జిల్లాలోని ధ‌ర్మపురి. ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం. ల‌క్ష్మీన‌ర‌సింహారావు కొలువుదీరిన ఆల‌యం. ఆ గ్రామంలో దారుణం జరిగిపోయింది. త‌న కుమార్తెను, ఆమెకు పుట్టిన ప‌సికందును స్వ‌యంగా ఓ త‌ల్లి పాతిపెట్టింది. రెండు రోజుల క్రితం జ‌రిగిన ఈ సంఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి రావ‌డం రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతున్న‌ది. విష‌యం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన గ్రామానికి చేరుకుని విచార‌ణ చేప‌ట్టారు. పోలీసులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం..

ధ‌ర్మ‌పురి గ్రామానికి చెందిన ఓ మైన‌ర్ బాలిక‌ను స్థానికంగా ఉన్న ఓ యువ‌కుడు మాయ‌మాట‌ల‌తో లొంగ‌దీసుకున్నాడు. శారీర‌కంగా వాడుకోవ‌డంతో స‌ద‌రు బాలిక గ‌ర్భం దాల్చింది. ఈ విష‌యాన్ని గుట్టుగా ఉంచిన ఆమె త‌ల్లి బిడ్డ‌ను ఇంట్లోనే ఉంచింది. ఈ క్ర‌మంలో రెండు రోజుల క్రితం కూతురుకు పుర‌టి నొప్పులు రావ‌డంతో ఇంట్లోనే సొంత‌వైద్యం చేసింది. ప్ర‌స‌వం చేసేందుకు య‌త్నించింది. ఈ క్ర‌మంలో త‌ల్లి, బిడ్డ మృత్యువాత ప‌డ్డారు. దీంతో ఏం చేయాలో తెలియ‌ని ఆ బాలిక త‌ల్లి అనంత‌రం కూతురు, ప‌సికందు శ‌వాన్ని ఇంటి స‌మీపంలోనే పూడ్చిపెట్టింది. ఈ విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌డంతో పోలీసులు వెంట‌నే రంగంలోకి దిగారు. త‌ల్లిని విచారించ‌డంతో అస‌లు విష‌యం తెలుసుకుని కంగుతిన్నారు. జ‌రిగిన ఘోరాన్ని తెలుసుకుని గ్రామ‌స్తులు కూడా షాక్‌కు గుర‌య్యారు. అనంత‌రం పూడ్చిపెట్టిన త‌ల్లిబిడ్డ‌ల శ‌వాల‌ను వెలికితీయించారు. పోస్టుమార్టానికి త‌ర‌లించారు. త‌ల్లిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తును చేప‌ట్టారు. ఈసంఘ‌ట‌న స్థానికంగానే కాక‌, రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది.

కూతురు, ఆమె బిడ్డ‌ను పూడ్చిపెట్టిన త‌ల్లి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts