న‌కిలీ చెక్కుల వ్య‌వ‌హారంలో సినీద‌ర్శ‌కుడు అరెస్టు

October 8, 2020 at 12:49 pm

ఏపీలో సంచలనం సృష్టించిన సీఎం రిలీఫ్ ఫండ్ నకిలీ చెక్కుల వ్యవహారం ఒక కొలిక్కి వ‌చ్చింది. విచార‌ణ‌లో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో కోస్టల్‌వుడ్ (తుళు సినిమా పరిశ్రమ) డైరెక్టర్ ఉదయ్ కుమార్ శెట్టి కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దక్షిణ కన్నడ జిల్లాలో అరెస్ట్ చేసిన కర్నాటక పోలీసులు.. ఆ సమాచారాన్ని ఏపీ పోలీసులకు చేరవేశారు. వివ‌రాల్లోకి వెళితే..

ఏపీ సీఎం సహాయ నిధి నుంచి అధిక మొత్తంలో డబ్బులు కొల్లగొట్టేందుకు చేసిన కుట్ర సెప్టెంబరు 20న వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. నకిలీ చెక్కులతో ఏకంగా రూ.112 కోట్లను కాజేయాలని స్కెచ్ వేశారు. నకిలీ సీఎంఆర్ ఎఫ్ చెక్కుల‌ను తయారు చేసిన కేటుగాళ్లు.. ఢిల్లీ, మంగళూరు, కోల్‌కతా బ్యాంకుల ద్వారా నగదును ఉపసంహరించాలని ప‌త‌కం వేశారు. అందులో భాగంగా మంగళూరులోని మూడ్‌బిద్రే శాఖలో రూ.52.65 కోట్లు, ఢిల్లీలోని సీసీపీసీఐ శాఖలో రూ.39.85 కోట్లు, కోల్‌కతాలోని మోగ్ రాహత్ శాఖలో రూ.24.65 కోట్ల చెక్కులను క్లియరెన్స్ కోసం సమర్పించారు. దీనిపై అనుమానం వ‌చ్చిన అధికారులు ఆ మూడు చెక్కుల‌ను జారీ చేసిన‌ విజయవాడ, ఎంజీ రోడ్‌ బ్రాంచ్‌ ఎస్‌బీఐ అధికారుల‌ను సంప్ర‌దించారు. అయితే అస‌లు తాము ఎలాంటి చెక్కులను జారీ చేయలేదని.. వాటిని క్లియర్ చేయవద్దని చెప్పడంతో ఈ కుట్ర బయటపడింది. దీనిని సీరియ‌స్‌గా తీసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సెప్టెంబరు 21 తేదీన తుళ్లూరులో కేసు నమోదు చేశారు. ఎట్ట‌కేల‌కు ఏసీబీలోని.. అర్బన్ కరెప్షన్ డిటెక్టివ్ ఫోర్సు నిందితులను గుర్తించారు. అనంతరం దక్షిణ కన్నడ జిల్లా పోలీసులను అలెర్ట్ చేయడంతో..మంగళూరులో నిందితులను అరెస్ట్ చేశారు. ఇక ఢిల్లీ, కోల్‌కతాలో నకిలీ చెక్కులను సమర్పించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. వారి కోసం కూడా ఏపీ పోలీసులు, ఏసీబీ ముమ్మ‌రంగా గాలిస్తున్నారు.

న‌కిలీ చెక్కుల వ్య‌వ‌హారంలో సినీద‌ర్శ‌కుడు అరెస్టు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts