కంగ‌నాపై దేశ‌ద్రోహం కేసు..!

October 18, 2020 at 1:09 pm

బాలివుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ ఈ మ‌ద్య వ‌రుస‌గా ప‌త్రిక‌ల్లో ప‌తాక‌వార్త‌గా నిలుస్తున్నారు. వివాదాల్లోనూ వ‌వ‌రుస‌గా చిక్కుకుంటున్నారు. ఇప్పుడు ఆమెపై మ‌రో కేసు న‌మోద‌యింది. ముంబైలోని బాంద్రా మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చందేల్‌పై ముంబై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బాలీవుడ్‌ కాస్టింగ్‌ డైరెక్టర్, ఫిట్‌నెట్‌ ట్రైనర్‌ మునావర్‌ అలీ సయ్యద్‌ దాఖలు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు జరపాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేప‌థ్యంలోనే కంగనా, ఆమె సోదరి గత రెండు నెలలుగా ట్వీట్లు, వివాదాస్పద ప్రకటనలు, ఇంటర్వ్యూలతో సమాజంలోని వివిధ వర్గాలు, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మునావర్‌ అలీ సయ్యద్‌ బాంద్రా కోర్టును ఆశ్రయించిన విష‌యం తెలిసిందే. దీనిని విచార‌ణ చేప‌ట్టిన కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కంగనా, రంగోలిపై ఐపీసీ సెక్షన్‌ 153ఏ(మతం, వర్గం ఆధారంగా ప్రజల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 295ఏ(మత విశ్వాసాలను గాయపర్చడం), 124ఏ (దేశద్రోహం) కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ఇదిలా ఉండ‌గా.. బాలివుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య సంద‌ర్భంగానూ కంగ‌నా, ఆమె సోద‌రి రంగోలి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బాలివుడ్‌లో బంధుప్రీతి రాజ్య‌మేలుతున్న‌ద‌ని, సినీతార‌ల వార‌సుల‌కే అవ‌కాశాలు వ‌స్తున్నాయ‌ని ఆరోపించి వార్త‌ల్లో నిలిచారు. ఇక ఇటీవ‌ల కేంద్రం తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను నిర‌సిస్తూ రైతులు చేస్తున్న ఆందోళ‌న‌ల‌పై కూడా కంగ‌నా అభ్యంత‌ర‌కర‌‌మైన వ్యాఖ్య‌లు చేశారు. వారిని తీవ్ర‌వాదుల‌తో పోల్చుతూ సోష‌ల్‌మీడియాలో కామెంట్ల‌ను పోస్టు చేశారు. దీనిపై కూడా ఓ న్యాయ‌వాది క‌ర్నాట‌క రాష్ట్రం తుమ‌కూరు జిల్లా న్యాయ‌స్థానంలో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డం, ఆ త‌రువాత కోర్టు ఆదేశాల‌తో కంగ‌నా పై కేసు న‌మోదు చేయ‌డం గ‌మ‌నార్హం. అదీగాక ముంబైన్‌ను పాకిస్తాన్‌తో పోల్చుతూ వివాదం రాజేశారు. దీనిపై శివ‌సేన నాయ‌కులు, కంగ‌నా మ‌ధ్య‌కు మాట‌ల యుద్ధ‌మే కొన‌సాగ‌డం గ‌మ‌నార్హం.

కంగ‌నాపై దేశ‌ద్రోహం కేసు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts