సైబ‌ర్ కేటుగాళ్లు.. మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల‌కే కుచ్చుటోపి

October 17, 2020 at 5:47 am

సైబ‌ర్ నేర‌గాళ్ల లీల‌లు అన్నీ ఇన్నీ కావు. రోజుకో తీరుగా వ‌ల విసురుతూ అమాయాకుల‌ను బుర‌డి కొట్టిస్తున్నారు. క్ష‌ణాల్లోనే ఖాతాల్లోని డ‌బ్బుల‌ను మాయం చేస్తున్నారు. లేకుంటే మాయ‌మాట‌ల‌తో న‌మ్మ‌బ‌లికి డ‌బ్బుల‌ను కాజేస్తున్నారు. వారి ట్రాప్‌లో వాళ్లు వీళ్లు అని కాకుండా మైక్రోసాఫ్ట్‌కు వంటి దిగ్గ‌జ సంస్థ‌కు చెందిన ఉద్యోగులు ప‌డ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రోవైపు సైబ‌ర్ కేటుగాళ్లు ఎంత‌లా రెచ్చిపోతున్నారో తెలుస్తున్న‌ది. సాంకేతిక స‌హాయం అందిస్తామంటూ న‌మ్మ‌బ‌లికి సుమారు 6 సంస్థ‌లకు కుచ్చుటోపి పెట్ట‌డం గ‌మ‌నార్హం. సీబీఐ అధికారులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం..

జైపుర్, ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, మైన్​పురీలోని ప్రైవేటు కంపెనీల కార్యాలయాల‌ను నెలకొల్పి కొంద‌రు కేటుగాళ్లుగా త‌మ సైబ‌ర్ నేరాల‌కు పాల్ప‌డ‌డం మొద‌లు పెట్టారు. కంప్యూట‌ర్ల‌లో మాల్​వేర్​ ఉందని తొలుత వినియోగదారులకు పాప్-అప్ సందేశాలను పంపించి వారి కంప్యూటర్లలోకి చొరబడ‌తారు. మాల్​వేర్​ను తొలగిస్తామని చెప్పి.. అనవసర సాఫ్ట్​వేర్లను ఇన్​స్టాల్ చేస్తారు. ఆ త‌రువాత వారి అకౌంట్ల వివ‌రాల‌ను తెలుసుకుంటూ డ‌బ్బుల‌ను మాయం చేస్తున్నారు. అదీగాక మాల్‌వేర్‌ను తొల‌గించేందుకు స‌ద‌రు వినియోగ‌దారుడి నుంచి భారీమొత్తంలో డ‌బ్బును కూడా వ‌సూలు చేయ‌డం గ‌మ‌నార్హం. తాజాగా ఇటీవ‌ల ఒక వినియోగ‌దారుడికి అలాగే పాప్​-అప్​ సందేశాన్ని పంపిచారు. అందులో వ‌చ్చిన నెంబర్​కు స‌ద‌రు ఉద్యోగి డయల్ చేయ‌గా ఆ కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్​ భారీగా నగదు డిమాండ్ చేశాడు. దీంతో అనుమానం వ‌చ్చిన అత‌ను వెంట‌నే సంబంధిత అధికారుల‌ను సంప్ర‌దించాడు. వారు వెంట‌నే స్పందించి సీబీఐ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేప‌థ్యంలో కేసు న‌మోదు చేసుకుని అధికారులు విచార‌ణ చేపట్టారు. అందులో భాగంగా జైపుర్, ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, మైన్​పురీలోని ప్రైవేటు కంపెనీల కార్యాలయాలు, నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఆయా కంపెనీల‌కు చెందిన రూ.190 కోట్లు విలువైన ఆస్తులను కేంద్ర దర్యాప్తు బృందం(సీబీఐ) సీజ్ చేసింది. సెప్టెంబర్ 17న నిర్వహించిన ఈ సోదాల్లో ఆస్తులతో పాటు 55 లక్షల విలువైన బంగారం, రూ.25 లక్షల నగదు, అనేక డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకుంది. తాజాగా ఆ కేసుకు సంబంధించి వివ‌రాల‌ను అధికారికంగా వెల్ల‌డించింది సీబీఐ. మరింత లోతుగా కేసును విచారణ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఆయా కంపెనీల బారిన ప‌డినవారిలో మొత్తంగా మైక్రోసాఫ్ట్ ఉద్యోగులే ఉండ‌డం గ‌మ‌నార్హం.

సైబ‌ర్ కేటుగాళ్లు.. మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల‌కే కుచ్చుటోపి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts