
నేడు జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారానికి తెరపడింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. సాయంత్రం ఆరు గంటల ముందు వరకూ కూడ జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేపట్టారు. ఇటీవలే గోషామహల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో కూడా టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా అందరూ టిఆర్ఎస్ వైపే ఉన్నారని గోషామహల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో కూడా టిఆర్ఎస్ భారీ మెజారిటీ సాధిస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు.
వరదల్లో చిక్కుకు పోయి ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో రాని బీజేపీ పెద్దలు ప్రస్తుతం ఎన్నికలు వచ్చేసరికి హైదరాబాద్ లో వాలిపోతున్నారు అంటూ విమర్శించారు కేటీఆర్. అయితే ప్రజలకు ఢిల్లీ బాయ్స్ కావాలా గల్లీ బాయ్స్ కావాలా మీరే నిర్ణయించుకోవాలి అంటూ సూచించారు కేటీఆర్. జిహెచ్ఎంసి ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి మేయర్ పీఠం టీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.