
గత కొన్ని నెలలుగా ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్.. ఎప్పుడు నాశనం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఎక్కడో చైనాలో ప్రాణం పోసుకున్న ఈ వైరస్ ధాటికి ఇప్పటికే కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. సామాన్యులే కాదు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, క్రీడా కారులు ఇలా అన్ని రంగాలకు చెందిన వారు కరోనా కాటుకు బలవుతున్నారు.
తాజాగా మరో ఎమ్మెల్యే కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ బీజేపీ మహిళా నేత, రాజ్ సమంద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి కరోనా కారణంగా కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం కరోనా పాజిటివ్ అని తేలడంతో.. గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. వైద్యులు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించారు.
అయినప్పటికీ ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి.. ఆదివారం అర్థరాత్రి కన్నుమూశారు. కాగా, రాజ్ సమంద్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె, రాజస్థాన్ బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న రాజకీయ ప్రముఖులు సంతానం తెలుపుతున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ కూడా సంతాపం వ్యక్తం చేశారు.