
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన చిత్రం `ఊసరవెల్లి`. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై.. ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని బెంగాలీలో రీమేక్ చేశారు. అక్కడ కూడా ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద బాల్తాపడింది. అయితే ఇప్పుడు ఈ ఫ్లాప్ చిత్రం బాలీవుడ్లో రీమేక్ కానుంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ టిప్స్ ఊసరవెల్లి రీమేక్ హక్కులను కొనుగోలు చేసింది. అంతేకాదు ఈ రీమేక్‌కి సంబంధించి ప్రస్తుతం అక్కడ స్క్రిప్ట్ పనులు కూడా జరుగుతున్నాయి. అలాగే హిందీ వెర్షన్ లో చాలా మార్పులు కూడా ఉండనున్నట్టు తెలుస్తోంది.
ఇక మరో విషయం ఏంటంటే.. ఈ హిందీ వెర్షన్లో హీరో అక్షయ్ ప్రధాన పాత్ర చేస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అక్షయ్ వైవిధ్యమైన కాంసెప్టులను ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. అందువల్ల ఈ సినిమాలో అతడే హీరోగా చేసే అవకాశాలు లేకపోలేదు. నటీనటులు, ఇతర టెక్నీషియన్లను త్వరలో నిర్ణయించనున్నారు.