
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన `మర్యాద రామన్న` సినిమాతో హీరోగా మారాడు స్టార్ కమెడియన్ సునీల్. ఆర్కా మీడియా పతాకంపై యార్లగడ్డ శోభు, దేవినేని ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో సునీల్‌కు జోడీగా సలోని నటించింది. ఈ చిత్రం అప్పట్లో మంచి హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత సునీల్ హీరోగా మరిన్ని అవకాశాలు అందుకున్నాడు.
అయితే గత కొంత కాలంలో వరుస డిజాస్టర్స్ ఎదుర్కోవడంతో కమెడియన్‌గా మారిపోయిన సునీల్.. ఇప్పుడు మళ్లీ హీరోగా మారబోతున్నాడు. ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో ప్రస్తుతం ఓ చిత్రం రూపొందుతోంది. ఎటువంటి అధికారిక ప్రకటన .. ప్రచారం లేకుండా కామ్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో సునీల్ కథానాయకుడుగా నటిస్తున్నాడు.
ఈ చిత్రంలో సునీల్ సరసన సలోని హీరోయిన్గా నటిస్తోంది. వీరిద్దరిది హిట్ పెయిర్ అవ్వడంతో దర్శకుడు ఆధిత్య ఆమెను ఎంపిక చేశాడనే వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ చిత్రాన్ని అనీల్ సుంకర నిర్మించనున్నట్టు తెలుస్తుండగా, ప్రముఖ ఓటీటీ సంస్థ కోసం ఈ ప్రాజెక్ట్ రూపొందనుందని చెబుతున్నారు.