
ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు కరోనా ప్రజలను, ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలోనూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం సంక్షేమ పధకాలను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. తాజాగా ఏపీలోని రైతన్నలకు జగన్ సర్కార్ శుభవార్త తెలిపింది.
ఇవాళ జగన్.. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం చెల్లింపులు చేయనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కంప్యూటర్లో బటన్ నొక్కి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. దీంతో 2019 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సకాలంలో పంట రుణాలు చెల్లించిన 14.58 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి వడ్డీ రాయితీ డబ్బు జమ కానుంది.
ఇందుకుగానూ రూ. 510.32 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అలాగే గత నెలలో వర్షాలు, వరదల వల్ల పంటలు నష్టపోయిన వ్యవసాయ, ఉద్యానవన రైతులకూ ఇన్పుట్ సబ్సిడీ కింద రూ. 132 కోట్లు అందించనుంది. దీంతో నేడు సీఎం జగన్ చేతుల మీదగా రూ.642.94 కోట్లు ఆన్లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో డబ్బు జమ అవుతాయి.