
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇక కరోనా కష్ట కాలంలో కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించటంలో జగన్ సర్కార్ ముందు వరుసలో ఉంటుంది. ఈ క్రమంలోనే జగన్ తాజాగా మరో అదిరిపోయే శుభవార్త చెప్పారు.
త్వరలోనే మరో కొద్ద పథకానికి శ్రీకారం చుట్టేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధం అయింది. రాష్ట్రవ్యాప్తంగా వీధి వ్యాపారాలు చేసుకునేవారికి ఆర్ధిక భరోసా కల్పించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి నవంబర్ 25వ తేదీన ‘జగనన్న తోడు’ అనే పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా వీధుల్లో చిరు వ్యాపారులకు ఐడీ కార్డులు ఇవ్వడంతో పాటు రూ.10వేల వరకు వడ్డీ లేని రుణాలను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.
వాటికి వడ్డీని పూర్తిగా ప్రభుత్వం.. బ్యాంకులకు చెల్లిస్తుంది. అంతేకాదు, ఇప్పటికే ఈ పధకం కింద 6.29 లక్షల దరఖాస్తులు బ్యాంకులకు చేరాయని సమాచారం. ఈ మేరకు తాజాగా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎం జగన్ వివరించారు.