
గత ఏడాది చైనాలోని వూహాన్ నగరంలో వెలుగు చూసిన ప్రాణాంతక కరోనా వైరస్ ఇప్పటికే కొన్ని ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మందిని బలి తీసుకుంది. వ్యాక్సిన్ లేని ఈ కరోనా వైరస్ ఇప్పటికీ ప్రజలపై, ప్రభుత్వాలపై ప్రభావం చూపుతూనే ఉంది. నలువైపుల నుంచి దాడి చేస్తున్న ఈ కరోనా కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్నా భిన్నం అయ్యాయి.
ఇలాంటి తరుణంలో కరోనా వ్యాక్సిన్‌పై ఎయిమ్స్ గుడ్ న్యూస్ చెప్పింది. టీకా పరీక్షలు దాదాపు తుది దశకు చేరుకోవడంతో ఈ నెలాఖరు, లేదంటే వచ్చే నెల ప్రారంభంలో టీకా అందుబాటులోకి వస్తుందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా వెల్లడించారు. ఇక అత్యవసర వినియోగానికి అనుమతులు లభించిన వెంటనే వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను స్టాట్ చేస్తామని ఆయన తెలిపారు.
అలాగే ఇప్పటి వరకు దాదాపు 80 వేల మంది వలంటీర్లకు టీకా ఇచ్చినా ఎవరిలోనూ ఎటువంటి సమస్యలు ఎదురు కాలేదన్నారు. అయితే, ఏదైనా వ్యాక్సిన్‌ను సుదీర్ఘకాలంపాటు తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. కాగా, ఇటీవల చెన్నైలో వ్యాక్సిన్ పరీక్షలో పాల్గొన్న ఓ వలంటీర్ అనారోగ్యానికి గురైనట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.