
ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ ప్రజలను, ప్రభుత్వాలను ముప్పతిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి ధాటికి ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో కరోనా టీకా కోసం ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు.
అయితే ఇలాంటి తరుణంలో తెలంగాణ వాసులకు వైద్య ఆరోగ్య శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. కరోనా నియంత్రణ టీకాలు వేయటానికి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమవుతోంది. ముందుగా నాలుగు విభాగాలకు చెందిన ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకాలు వేయాలని నిర్ణయం తీసుకుంది. జనవరి రెండో వారం నుంచి టీకాలు వేయనున్నారు.
వైద్య సిబ్బంది, పోలీస్, పారిశుద్ధ్య కార్మికుల్లో 80 లక్షల మందిని ఇప్పటికే గుర్తించామని ఆ శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఒక కోటి 60 లక్షల టీకాలు సిద్ధం చేసే పనిలో ప్రస్తుతం నిమగ్నమయ్యామని తెలిపారు. అలాగే కేంద్రం ఆదేశాలు మేరకు ఒక్కొక్కరికి రెండు డోసుల్లో టీకాలు వేయనున్నారని ఆయన తెలిపారు.