
కోలీవుడ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్` ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి కొనసాగింపులో కేజీఎఫ్ 2 రాబోతోంది. ఈ సీక్వెల్లో సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యశ్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఇటీవల యశ్ బర్త్‌డే కానుకగా ఈ సినిమా టీజర్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే వరల్డ్ రికార్డులను సైతం సృష్టించింది. అయితే అలాంటి టీజర్ ఇప్పుడు చిత్ర టీమ్‌ను చిక్కుల్లో పడేసింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ టీజర్ చివరి సీన్లో తుపాకితో వాహనాలను వరుసగా షూట్ చేసే యశ్.. ఆ తర్వాత తుపాకి గొట్టంతో సిగరెట్ ముట్టించుకుంటాడు.
అయితే, ఈ సీన్ వస్తున్నప్పుడు యాంటీ స్మోకింగ్ వార్నింగ్ వేయలేదని ఆరోపిస్తూ కర్ణాటక స్టేట్ యాంటీ టొబాకో సెల్ దర్శక నిర్మాతలతో పాటు హీరో యశ్ కు కూడా నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, ఆ టీజర్ ను యూట్యూబ్ నుంచే గాక ఇతర ప్లాట్ ఫాం ల నుంచి కూడా తీసేయాలని కర్నాటక స్టేట్ యాంటీ టొబాకో సెల్ డిమాండ్ చేసింది. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.