
ఏపీలో పంచాయతీ ఎన్నికల వార్ మొదలైంది. ఇప్పటికే తొలిదశ ఎన్నికలకు ఇప్పటికే ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేశారు. కానీ, ఎన్నికలు మాత్రం సేగేనా? ఆగేనా? అన్న ఉత్కంఠ మాత్రం అందరిలోనూ కొనసాగుతోంది. ఎన్నికల నోటీఫికేషన్ జారీ చేయడంతో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
మరోవైపు కరోనా నేపథ్యంలో ఎన్నికలు నిలిపేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో నేడు విచారణ జరగనుంది. ఈ విచారణ అనంతరం సుప్రీం ఇచ్చే తీర్పుతో… రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ మధ్య నెలకొన్న వివాదంలో నెగ్గేది ఎవరో తేలిపోనుంది. దీంతో ఈరోజు ఏం జరగబోతోంది? సుప్రీం ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది? అందరిలో ఇదే ఉత్కంఠ.
ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఎస్ఈసీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కరోనా నుంచి రక్షణ పొందేందుకు చేపట్టిన టీకా కార్యక్రమం పూర్తికాకుండా ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని ఉద్యోగుల వాదన. ఇక పంచాయతీ ఎన్నికలపై ఇంత రచ్చ జరుగుతుంటే మరోవైపు విపక్షాలు మాత్రం ఎన్నికలకు సన్నద్ధమవుతుండడం గమనార్హం.