
అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని లక్షల మంది ప్రాణాలను బలితీసుకున్న ఈ కరోనా వైరస్‌ను నిర్వూలించేందుకు ప్రపంచదేశాల్లోనూ వ్యాక్సినేషన్ ప్రారంభం అయింది. ఇక మన దేశంలోనూ కరోనా టీకా పంపిణీ జోరుగా కొనసాగుతోంది. అయితే అక్కడక్కడా వ్యాక్సిన్ తీసుకున్న పలువురు అస్వస్థతకు గురవుతున్నారు.
ఇటీవల తెలంగాణలో ఓ వ్యక్తి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మరణించాడు కూడా. ఇక తాజాగా ఏపీలో వ్యాక్సిన్ తీసుకున్న ఓ మహిళా ఆశా వర్కర్ బ్రెయిట్ డెడ్ అయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం పెనుమాకలో విజయలక్ష్మి(42) ఆశా వర్కర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 20న గుంటూరులో ఆమెకు వ్యాక్సిన్ వేయగా.. రెండు రోజులకు విజయలక్ష్మిలో మగత, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి.
దీంతో ఆమె 22వ తేదీన గుంటూరు జీజీహెచ్ కి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ క్రమంలోనే విజయలక్ష్మీ బ్రెయిన్ స్టెమ్ స్ట్రోక్‌కు గురైనట్టు వైద్యలు నిర్ధారించారు. బ్రెయిన్ డెడ్ అవ్వడంతో విజయలక్ష్మి పరిస్థితి విషమంగా ఉందని ఆదివారం ఉదయం జీజీహెచ్ వైద్యులు తెలిపారు. ఇక విజయలక్ష్మి బ్రెయిన్ డెడ్ అవ్వడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. అయితే విజయలక్ష్మీకి వేసిన వయల్ నుంచే మరో వైద్యుడికి టీకా వేసినా ఆయనకు ఎటువంటి దుష్ప్రభావం తలెత్తలేదని సమాచారం.