11న సీఎం కేసీఆర్ కీల‌క స‌మావేశం..!

January 8, 2021 at 12:06 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ నెల 11న కీల‌క స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. ఉదయం 11.30 గంటల నుంచి రాష్ట్ర మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రగతభవన్ లో ప్ర‌త్యేకంగా భేటి కానున్నారు. రెవెన్యూ, పంచాయతిరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖ, అటవీ శాఖలతో పాటు ఇతర శాఖల ముఖ్యమైన అంశాలపై సమావేశంలో చర్చించి ప‌లు కీల‌క నిర్ణయాలు తీసుకోనున్నార‌ని స‌మాచారం. రెవెన్యూకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రగతిభవన్ లో సీనియర్ అధికారులు, కొంత మంది కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో రెవెన్యూకు సంబంధించి పరిష్కరించాల్సిన కొన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. 11వ తేది నాడు జరిగే సమావేశంలో ఆ అంశాలను కూలంకషంగా చర్చిస్తారు. పెండింగ్ మ్యుటేషన్లు, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, ట్రిబ్యూనల్ల ఏర్పాటు, పార్ట్.బీ లో చేర్చిన అంశాల పరిష్కారం తదితర విషయాలపై సమాశంలో చర్చించి అన్ని అంశాలను సత్వరంగా పరిష్కరించేందుకు అవసరమైన కార్యాచరణను ఈ సమావేశంలో నిర్ణయించ‌నున్న‌ట్లు తెలుస్తున్న‌ది.

అదేవిధంగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందించే కార్యాచరణపై చర్చిస్తారు. వ్యాక్సీన్ అన్ని ప్రాంతాలకు సరఫరా చేయడం, ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సీన్ ను పౌరులకు వేయడానికి సంబంధించిన కార్యాచరణను రూపొందిస్తారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలును సమీక్షిస్తారు. గ్రామాలకు, పట్టణాలకు నిధులు సకాలంలో అందుతున్నాయా? వాటి వినియోగం ఎలా ఉంది ? తదితర అంశాలపై చర్చిస్తారు. ఆయా కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన పనుల పరోగతిని సమీక్షిస్తారు. హరితహారం కార్యక్రమం అమలును సమావేశంలో సమీక్షిస్తారు. గ్రామాల్లో, పట్టణాల్లో పచ్చదనం పెంచడానికి తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తారు. రాష్ట్రంలో విద్యా సంస్థల్లో తరగతులను ఎప్పటి నుంచి తిరిగి ప్రారంభించాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఏ తరగతి నుండి క్లాసులు నిర్వహించాలి ? ఏ విధంగా నిర్వహించాలి ? ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానం ఏమిటి ? తదితర అంశాలపై కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఈ సమావేశానికి కలెక్టర్లు, అధికారులు సమగ్ర సమాచారంతో రావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

11న సీఎం కేసీఆర్ కీల‌క స‌మావేశం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts