
సాధారణంగా మనుషులు కంటే కుక్కలు మనిషికి మంచి స్నేహితులు అని చెబుతుంటారు. అవును నిజమే మనుషుల భావాలను, మాటలను శునకాలు బాగా అర్థం చేసుకుంటాయి. తన ఓనర్ సంతోషంగా ఉంటే కుక్కలు ఇంకా హుషారుగా ఉంటాయి. వారు బాధపడితే అవి కూడా బాధపడుతూనే అమాయకంగా వాటి ప్రవర్తనలతో తమ యజమానిని ఓదారుస్తుంటాయి. అలాగే ఒక శునకం తన యజమాని కాలికి దెబ్బ తగిలి బాధపడుతుంటే సానుభూతి చూపే ప్రయత్నంలో ఆయన్ను అనుకరించే ప్రయత్నం చేసింది. దీంతో ఆ యజమానికి ఏకంగా రూ. 26వేల బిల్ అయింది. అసలు ఏం జరిగిందంటే.. లండన్‌లో నివసించే రస్సెల్ జోన్స్‌కు ఇటీవల కాలికి గాయమవ్వటంతో చికిత్సలో భాగంగా డాక్టర్స్ ఆయన కాలుకు కట్టు కట్టారు. దీంతో రస్సెల్ కర్రల సాయంతో కుంటు కుంటూ నడవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎదో పని నిమిత్తం రస్సెల్ బయటకు వెళ్తుంటే ఆయన పెంచుకుంటున్న కుక్క బిల్ కూడా ఆయన వెంట వెళ్లేది.
అయితే, తన యజమాని కుంటుతుండటంతో బిల్ కూడా ఆయనతో పాటు కుంటడం షురూ చేసింది. రస్సెల్ మాత్రం కుక్క కాలికి కూడా గాయమైందేమోనని చాలా కంగారు పడ్డారు. వెంటనే పశు వైద్యుల వద్దకు తీసుకెళ్లి ఎక్స్‌రే, ఇతర పరీక్షలు కూడా చేయించాడు. కానీ వైద్యుల నివేదికలో బిల్ కాలికి ఎలాంటి గాయాలు లేవని తేలింది. అప్పుడు రస్సెల్ కి అర్ధమయింది. తను కుంటు కుంటూ నడవంతో బిల్ తనని అనుకరించిందని తేలింది. తన కుక్క చూపించిన సానుభూతికి రస్సెల్ ముగ్ధుడై దానికి నిర్వహించిన వైద్య పరీక్షలకు 300యూరోలు అంటే రూ.26,533 ఖర్చు అయ్యాయి. ఈ సంగతిని రస్సెల్ తన ఫేస్బుక్లో షేర్ చేస్తూ తనను అనుకరిస్తూ కుంటుతున్న తన కుక్క వీడియో తీసి జత చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్ అవ్వటమే కాకుండా యజమానిపై ఆ కుక్క చూపించిన ప్రేమ, సానుభూతికి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.