
అవును, మీరు విన్నది నిజమే. ముప్పై నిమిషాల్లో ఏకంగా ముప్పై కేజీల నారింజ పండ్లను లాగించేశారు ఓ నలుగురు వ్యక్తులు. ఇది వినగానే ఏదో ఫుడ్ కాంపిటేషన్ అని అనుకుంటారు. కానీ, ఎలాంటి కాంపిటేషన్ కాదు. మరి ఎందుకు అలా తిన్నారు అన్నది తెలియాలంటే అసలు మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే.
సాధారణంగా లగేజీ ఎక్కువగా ఉంటే విమాన ప్రయాణాల్లో ఎంత అధికంగా చెల్లించాల్సి వస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా నలుగురు చైనీయులు ఓ బిజినెస్ ట్రిప్ నిమిత్తం బయలుదేరి.. తమవెంట 30 కిలోల బరువున్న ఆరంజ్ బాక్స్ ను యునాన్ ప్రావిన్స్‌లోని కున్మింగ్లోని విమానాశ్రయానికి తీసుకుని వచ్చారు. అయితే ఇవి తమ వెంట తీసుకెళ్లాలంటే ఏకంగా 300 యువాన్లు లగేజీ చార్జ్ చెల్లించాలని అక్కడి అధికారులు చెప్పారు.
ఆరెంజ్‌లను కొన్న ధర కంటే ఆరు రెట్ల లగేజీ చార్జ్ ఎక్కువగా ఉంది. దీంతో ఆ నలుగురు వ్యక్తులు అదనపు చార్జీని తప్పించుకునేందుకు అరగంట వ్యవధిలో వెంట తెచ్చుకున్న 30 కిలోల నారింజ పండ్లను తినేశారు. ఇక అన్ని కేజీల పండ్లను అరగంటలోనే నలుగురు వ్యక్తులు తినడంతో.. విమానాశ్రయంలో ప్రజలు షాక్ అయిపోయారు. అంతేకాదు, కొందరు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో పోస్ట్ చేయగా.. ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.