
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో `రాధేశ్యామ్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ఓం రౌత్ దర్శకత్వంలో `ఆదిపురుష్`, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రం మరియు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్` చిత్రాలు చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేశాడు.
అయితే వీటిలో నాగ్ అశ్విన్ సినిమా విషయానికి వస్తే.. 400 కోట్ల భారీ బడ్జెట్తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించనున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తుంది. అంతేకాకుండా ఇందులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడిస్తానని ఈ నెల ప్రారంభంలో దర్శకుడు చెప్పారు.
సంక్రాంతి పండుగ వెళ్లి పదిరోజులు కావొస్తున్నా ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో నెటిజన్లు ట్విటర్ వేదికగా దర్శకుడిపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో నాగ్ అశ్వీన్ స్పందిస్తూ… “జనవరి 29న ఒకటి, ఫిబ్రవరి 26న ఒకటి.. కచ్చితంగా అప్డేట్లు ఉంటాయని” సమాధానమిచ్చారు. దీని బట్టీ చూస్తే.. నాగ్ అశ్విన్ డబుల్ ట్రీట్ రెడీ చేసినట్టు అర్థం అవుతోంది. ఈ క్రమంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.